KCR Bharosa : ఆ విషయంలో అభ్యర్థులకు కేసీఆర్ భరోసా
KCR Bharosa : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కవు. సమయానుకూలం అనే కంటే ముందుగానే ఊహించి నిర్ణయాలు తీసేసుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తరువాత బీఆర్ఎస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పదేళ్లు పదవులు అనుభవించిన పలువురు నేతలు పార్టీని వీడారు. పోతూపోతూ కేసీఆర్ విమర్శలు గుప్పించి వెళ్లారు. రాజకీయ పరిణామాలు కేసీఆర్ కు కొంత వ్యతిరేకంగా కనిపిస్తు్న్నా ఆయనలో మాత్రం కొంత కూడా బెణకు లేదు. రాష్ట్ర, కేంద్ర అధికార పార్టీలకు వ్యతిరేకంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కనిపిస్తున్నది. అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శల దాడికి దిగుతున్నాయి. తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ తన అభ్యర్థులను ఫైనల్ చేయడంతో పాటు బీ ఫామ్ లు కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం అధికారంలో లేకున్నా ఒక్కో అభ్యర్థికి 95 లక్షలు( ఎన్నికల నిబంధనల ప్రకారం) ఇచ్చేశాడు.
నో కన్ఫ్యూజన్.. కంప్లీట్ క్లారిటీ
అభ్యర్థుల ఎంపిక నుంచి బీఫామ్ లు కేటాయించే వరకు పూర్తి క్లారిటీ ఇస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దీంతో అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకుంటారు. అభ్యర్థి ఎటువంటి డైలామా ఉండదు. క్యాడర్ కూడా అంతే ఉత్సాహంగా పనిచేస్తుంది. విజయం సాధించాలంటే ముందుగా ఈ విషయాల్లో క్లారిటీ ఉండాలనేది కేసీఆర్ అభిప్రాయం. ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం, నామినేషన్ల సమయానికి ముందుగానే బీఫామ్ కేటాయించడం కేసీఆర్ ముందునుంచి చేస్తున్నారు.
జాతీయ పార్టీల్లో తొలగని సందిగ్ధత..
దాదాపు నెల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ప్రస్తుతం నోటిఫికేషన్ రావడం, నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. కానీ జాతీయ పార్టీలు మాత్రం అభ్యర్థుల ఖరారులో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఉన్న అభ్యర్థులు మార్చుతానే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా డైలమాలోనే ఉన్నది. మరో మూడు మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులనే మార్చుతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో 17 స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ఫైనల్ చేసింది. కానీ ప్రచారం లో వీక్ గా ఉన్న ఓ ముగ్గురు అభ్యర్థులను మార్చాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే తన పార్టీ అభ్యర్థులను.. సిట్టింగ్ ఎంపీలను రెండు జాతీయ పార్టీలు లాక్కున్నా.. కేసీఆర్ లో మాత్రం ఇసుమంతయినా కూడా ధైర్యం కోల్పోవడం లేదు. .
పార్టీ ఫిరాయించిన సీనియర్లు..
సీనియర్ నేతలు కడియం శ్రీహరి, గడ్డం రంజిత్ రెడ్డి, కే.కేశవరావు, దానం నాగేందర్ తెల్లం వెంకటరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లాంటి కీలక వ్యక్తులు పార్టీని వీడారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ప్రస్తుతానికి సైలెంటయ్యారు. మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇంత గడ్డు పరిస్థితుల్లోనూ కేసీఆర్ ధైర్యంగా ముందుకు సాగుతుండడంపై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతున్నది.