KCR Believed Sentiment : సెంటిమెంట్ నే నమ్ముకున్న కేసీఆర్.. జాతీయవాదం వీడి మరోసారి ప్రాంతీయవాదం
KCR Believed Sentiment : తెలంగాణ రాష్ర్టం సాధించిన వ్యక్తిగా, ఉద్యమరథ సారథిగా సీఎం కేసీఆర్ కు ఈ ప్రాంత ప్రజల్లో ఆదరణ ఎంతో ఉంది. ఒకరకంగా తెలంగాణ జాతిపిత గా ముద్రపడ్డారు కూడా. రెండు పర్యాయాలు వరుస విజయం తర్వాత ఆయనకు ఇక రాష్ర్టంలో తనకు తిరుగులేదని ధీమా వచ్చింది. ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ద్వారా ముఖ్యమంత్రిగా తన కుమారుడు, మంత్రి కేటీఆర్ కు లైన్ క్లియర్ చేయాలని భావించారు. ఇక తెలంగాణ రాష్ర్ట సమితిని భారత రాష్ర్ట సమితి గా మార్చేశారు.
పంజాబ్ , ఒడిశా, మహారాష్ర్ట, ఏపీ లాంటి చోట్ల పార్టీ విస్తరణ కు శ్రీకారం చుట్టారు. అక్కడ ఇన్ చార్జిలను కూడా నియమించారు. వరుసగా మహారాష్ర్టలో మూడు సభలు నిర్వహించారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ చక్రం తిప్పబోతున్నదని, రానున్న సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా మారబోతున్నామని చెప్పుకొచ్చారు. కానీ అక్కడే సీన్ రివర్స్ అయ్యింది. ప్రస్తుతం తెలంగాణలోనే ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తానే రెండు సీట్లలో పోటీ చేయాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారు.
ఇక ప్రస్తుతం గ్రౌండ్ లెవల్ పరిస్థితులు సీఎం కేసీఆర్ కు అర్థమయ్యినట్లున్నాయి. ఒక్కసారిగా జాతీయ వాద రాజకీయాల నుంచి యూటర్న్ తీసుకున్నారు. ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాల్లో కీలకమని పదేపదే చెబుతున్నారు. ఇక తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దేశ రాజకీయాల్లో మాట అలా ఉంచితే రాష్ర్ట రాజకీయాల్లోనే పరిస్థితి మారిపోయిందని, తన ఇమేజ్ మసక బారుతున్నదని కేసీఆర్ గుర్తించినట్లున్నారు. దీంతో వెంటనే ఆయన మరోసారి సెంటిమెంట్ ను రేపేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే ప్రస్తుతం ఎన్నికల సభల్లో ఎక్కడ చూసినా కేసీఆర్ ఒకే తీరులో మాట్లాడుతున్నారు. ఆయన సహజమైన ప్రసంగాలకు విరుద్దంగా ప్రస్తుత ఎన్నికల సభలు కొనసాగుతున్నాయి. ఏదేమైనా ఆయన వదిలే చివరి అస్ర్తం ఎలా ఉంటుందో తెలియక ఇప్పుడు ప్రతిపక్ష నేతలు కూడా టెన్షన్ లో ఉన్నారు.అయితే తెలంగాణ రాజకీయాల్లో తనకు తిరుగే లేదని అనుకున్న కేసీఆర్ కు మాత్రం తత్వం బోధపడడం ప్రతిపక్షాల్లో ఆనందానికి కారణమవుతున్నది.