MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విడుదలయ్యారు. ఐదున్నర నెలల తర్వాత విడుదలైన కవితను కలిసేందుకు తీహార్ జైలుకు పెద్ద సంఖ్యలో బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. జైలు నుంచి పిడికిలి బిగించి బయటకు వచ్చిన కవిత.. కొడుకును తొలిసారి చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత భర్తను కూడా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘‘ఐదున్నర నెలల తర్వాత మీ అందరినీ మళ్లీ కలుసుకోవడం ఆనందంగా ఉంది. 18 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను.. నన్ను అనవసరంగా జైల్లో పెట్టినందుకు వాళ్లు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. పిల్లలకు, కుటుంబానికి దూరంగా ఉన్న తల్లి. అయిదున్నర నెలలుగా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను, నా కుటుంబాన్ని అన్యాయంగా బాధించిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. కష్టకాలంలో నాకు, నా కుటుంబానికి అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు, నేను తెలంగాణ బిడ్డను.. తప్పు చేయను. నన్ను అనవసరంగా జైలుకు పంపారు. నేను మొండిదాన్ని.. జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారు.’ అంటూ చెప్పుకొచ్చారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యాఖ్యలతో ఆమె తదుపరి పొలిటికల్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది.
మద్యం కుంభకోణంలో కవిత కింగ్ పిన్ అని తీవ్ర ఆరోపణలు రావడంతో కల్వకుంట్ల కుటుంబం ఆమెను రాజకీయాలకు దూరంగా ఉంచనుందన్న ప్రచారం కొద్ది రోజులగా సాగింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కవిత కేసు ఎపిసోడ్ తీవ్ర ప్రభావం చూపిందని బీఆర్ఎస్ అధినేత ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారం పార్టీని అప్రతిష్టకు దారి తీసిందని, అందుకే జైల్లో కవితను చూసేందుకు కూడా కేసీఆర్ వెళ్లలేదని ప్రచారం జరిగింది. కవితకు బెయిల్ దక్కగానే ఆమె రాజకీయ ప్రయాణంపై చర్చలు మొదలు అయ్యాయి. కొన్నాళ్ల పాటు ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారనే చర్చ జరిగింది. కానీ , జైలు నుంచి బయటకు వచ్చాక కవిత చేసిన ప్రకటన ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని తేల్చేసింది కవిత… గతానికి మించి మరింత దూకుడుగా రాజకీయాలు చేస్తానంటూ ప్రకటించారు.