MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని సీబీఐ పేర్కొంది. ఇందులో కీలక ఆధారాలు లభించాయని చెబుతోంది. లిక్కర్ స్కాంలో అరెస్టయిన కవితను గురువారం ప్రశ్నించింది. కవితను అరెస్టు చేయకముందే హైదరాబాద్ లో ఓసారి ప్రశ్నించింది. ఇప్పుడు కవితను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టును అభ్యర్థించింది. దీంతో ఆమెను సీబీఐ కోర్టుకు తరలించారు.
లిక్కర్ స్కాంలో సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. కవితకు కేసుతో సంబంధం ఉందని చెప్పింది. అందుకే ఆమెను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఇందులో కవిత ప్రధాన సూత్రధారిగా అభివర్ణించింది. బుచ్చిబాబుతో చాటింగ్ లో కేసుకు సంబంధించిన చాలా విషయాలు తెలిశాయి. వాటిని కోర్టుకు సమర్పించింది. విజయ్ నాయర్, అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లితో కవిత వ్యవహారాలు నడిపించినట్లు ఆధారాలు లభించాయి.
కవిత ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. బినామీలతో స్కాంకు సంబంధించిన పనులు నిర్వహించారు. మాగుంట రాఘవ ద్వారా ఎన్వోసీ తీసుకోవాలని ప్రయత్నించింది. సుమారు రూ.25 కోట్ల వ్యాపారం కొనసాగించినట్లు తెలుస్తోంది. డబ్బులు ఆలస్యమైతే బాగుండదని బెదిరించినట్లు సమాచారం. ఇలా సీబీఐ సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.
సీబీఐ తరఫు న్యాయవాదులు కవిత అరెస్టుపై మెమో దాఖలు చేశారు. కవిత తరఫు లాయర్లు ఆమె అనుమతితోనే సీబీఐ అరెస్టు చేసిందని పేర్కొన్నారు. కోర్టును ప్రశ్నించొద్దని న్యాయమూర్తి హెచ్చరించారు. సీబీఐ అరెస్టుపై రాత్రి 10.30 గంటలకు సమాచారం ఇచ్చారని కవిత పేర్కొంది. సీబీఐ కస్టడీపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో బీఆర్ఎస్ ప్రతిష్ట మసకబారింది. ఇన్నాళ్లు మాది స్వచ్ఛమైన పార్టీ అని గొప్పలు చెప్పుకున్న పార్టీ నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. పార్టీ నాయకులు వీడుతున్నారు. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. భవిష్యత్ లో మరిన్నినష్టాలు వస్తాయనే భయంలో నేతలు ఉన్నారు.