Kavitha Judicial Custody : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. జూలై 5 వరకు కస్టడీ పొడిగిస్తూ స్పెషల్ జడ్జి ఉత్తర్వులు వెలువరించారు. గతంలో విధించిన కస్టడీ ముగియడంతో శుక్రవారం కవితను వర్చువల్ మోడ్ లో కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ సందర్భంగా కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది.
సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, జూలై 5 వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. కాగా, లిక్కర్ స్కాం కేసులో ఏప్రిల్ 11న కవితను సీబీఐ తీహార్ జైలులో అదుపులోకి తీసుకొని, ఇటీవల ఆమెపై చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణను ట్రయల్ కోర్టు వాయిదా వేసింది. మరోవైపు, ఇదే కేసులో కవితను ఈడీ ఈ ఏడాది మార్చి 15న అరెస్టు చూసి, చార్జ్ షీట్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు జూలై 3న విచారణ చేపట్టనుంది. అలాగే, కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.