Kavitha : ఈడీకి కవిత జలక్.. వారి బాటలోనే నడుస్తుందిగా..
Kavitha : ఢిల్లీ మద్యం స్కాంలో నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఎమ్మెల్సీ కవిత షాక్ ఇచ్చారు. విచారణకు తాను హాజరు కావడం లేదంటూ ఈడీ అధికారులకు ఈ మెయిల్ పంపడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేకిత్తిస్తోంది. ఇప్పటికే ఈడీ తనను విచారణకు పిలిపించడం కరెక్ట్ కాదంటూ కోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఈరోజు ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. అయితే చివరి నిమిషంలో తాను హాజరుకాలేనంటూ ఈడీకి కవిత ఈమెయిల్ పంపారు. ఇందులో ఈడీ విచారణకు గైర్హాజరు కావడానికి గల కారణాలను అందులో వివరించారు. సుప్రీం కోర్టులో తనపై ఈడీ విచారణ కేసు పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. దీంతో ఈడీ ఇప్పుడెలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, వేరే ఇతర కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ బాటలోనే కవిత కూడా వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే నాలుగు సార్లు ఈడీ నోటీసులు జారీ చేసినా.. కేజ్రీవాల్ కూడా విచారణకు హాజరు కాలేదు. ఈడీకి ఎప్పటికప్పుడు తన వాదనతో లేఖలు రాస్తునే ఉన్నారు. తనను అరెస్ట్ చేసుకుంటే చేసుకోండని సవాల్ విసురుతున్నారు.
ఇప్పుడు కవిత కూడా అదే దారిని ఎంచుకున్నారు. సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును సాకుగా చూపుతున్నారు. ఒకవేళ ఈ కేసులో తనను అరెస్ట్ చేస్తే.. దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం తనను రాజకీయంగా ఎదుర్కొలేకనే కుట్ర చేసి అరెస్ట్ చేసిందని నిరసన కార్యక్రమాలకు దిగవచ్చు. అలాగే మహిళా నేతను అరెస్ట్ చేశారని ఎన్నికల వేళ సానుభూతి ఓట్లను పొందవచ్చు. ఇలా తన అరెస్ట్ తో పార్టీని ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి తెప్పించి.. బీజేపీని కుట్రదారుగా చేస్తూ ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.