JAISW News Telugu

Kavitha Bail Denied : కవితకు మళ్లీ బెయిల్ నిరాకరణ..

Kavitha Bail Denied

Kavitha Bail Denied

Kavitha Bail Denied : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే ఎదురైంది. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. కవితకు బెయిల్ నిరాకరిస్తూ.. పిటిషన్లను డిస్మిస్ చేసింది. స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా ఈ తీర్పు వెలువరించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రిమాండ్‌లో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ కవితను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ మద్యం పాలసీని తమకు అనుకూలంగా తయారు చేయించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. మద్యం పాలసీని తనకు అనుకూలంగా రూపొందించినందుకు గాను కవిత ఆప్‌కు రూ. 100 కోట్లు లంచం ఇచ్చారని సీబీఐ, ఈడీ ఆరోపణలు చేసింది. రూ.100 కోట్ల లంచం డబ్బులను సౌత్ గ్రూప్ సిండికేట్ నుంచి కవిత వసూలు చేశారని అభియోగాలు మోపారు. ఈ వ్యవహారంలో పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండోస్పిరిట్‌లో 33 శాతం వాటా దక్కించుకున్నట్లు ఆరోపించారు. దీంతో కవితను అరెస్టు చేసిన ఈడీ, సీబీఐ అధికారులు తమ కస్టడీలోకి  తీసుకున్నారు.

సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిలు ఇవ్వాలని ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 22న ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఈ కేసు రాజకీయ కక్షతో పెట్టారని.. కేవలం అప్రూవర్ల స్టేట్‌మెంట్లను ఆధారం చేసుకొని అరెస్టు చేశారంటూ  కవిత తరపు న్యాయవాదులు వాదించారు. ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని తమ వాదనలు వినపించారు. ఈ వాదనలపై ఈడీ, సీబీఐ తరపు న్యాయవాదులు కూడా కౌంటర్ ఇచ్చారు. కవితకు బెయిల్ మంజూరు చేయొద్దని వాదించారు. ఈ కేసులో కవితనే ప్రధాన కుట్రదారు అని.. ఆమె బయటకు వస్తే సాక్షాలను మాయం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం కూడా ఉందని వాదించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 2కు ఆ తర్వాత ఈనెల 6కు వాయిదా వేసింది. తాజాగా.. ఈడీ, సీబీఐ లాయర్ల వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పుపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. రేపటితో ఆమె కస్టడీ ముగుస్తుంది. దీంతో మరోసారి ఆమెను న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నారు.

Exit mobile version