Raghurama : ఏపీలో ఎన్నికల కాక పెరుగుతోంది. నిన్న బీజేపీ తమ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. అందులో నరసాపురం స్థానాన్ని భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించగా, నరసాపురం నుంచి టికెట్ ఆశించిన రఘురామకృష్ణంరాజుకు చుక్కెదురైంది. తనకు టికెట్ దక్కకపోవడంతో, దీని వెనుక జగన్ కుట్ర ఉందని రఘురామ తాజాగా సంచలన ప్రకటన చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో తాను కచ్చితంగా బరిలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు మెసేజ్ లు పంపుతున్నారని, ఫోన్లు చేస్తున్నారని పేర్కొన్న రఘురామ తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని సంతోషంలో కూడా లేనని చెప్పారు. తనకు జగన్ మార్క్ షాక్ ఇవ్వబోతున్నారని, టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని, పిల్ల సజ్జల వెబ్ సైట్లు, మీడియా చానల్స్ ముందే చెప్పాయని పేర్కొన్నారు.
తనకు టికెట్ రాకుండా తాత్కాలికంగా జగన్ విజయం సాధించారని, తాను అపజయాన్ని అంగీకరిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం మూడు అడుగులు వెనక్కి వేస్తున్నానని రానున్న రోజుల్లో ప్రజాబలం, ప్రజల అండతో, ప్రతీ వ్యక్తి చేత ముందడుగు వేయించి జగన్ ను అధ:పాతాళం తొక్కకపోతే తన పేరు రఘురామకృష్ణంరాజే కాదని శపథం చేశారు. మరో మూడు వారాల్లో ఎన్ని అడుగులు ముందుకు వేస్తానో చూస్కో జగన్, ఇక కాస్కో జగన్ అంటూ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తాను ప్రజాక్షేత్రంలో ఉండడం ఖాయమంటూ తేల్చిచెప్పారు.