Karnataka CM : మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లకు కర్ణాటక సీఎం సీరియస్ వార్నింగ్
Karnataka CM : మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మద్యం సేవించి పదే పదే వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నేరస్తులకు లైసెన్స్ రద్దు చేస్తామని ప్రకటించారు. 65 అధునాతన అంబులెన్స్‌ల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డికి ఆయన సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయన్నారు. ‘ముఖ్యమంత్రి ఆపత్కాల సేవ’లో భాగంగా కొత్తగా కొనుగోలు చేసిన 65 అంబులెన్స్‌లను సిద్ధరామయ్య జెండా ఊపి ప్రారంభించారు.
మద్యం సేవించే వారు డ్రైవర్‌ను నియమించుకోవాలని – లేదా క్యాబ్‌లు, ఆటోల్లో ప్రయాణించాలని సూచించారు. వాహనం నడపడంతోపాటు హుందాగా మాట్లాడడం, నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడపడం తదితరాలు ప్రమాదాలకు కారణమవుతాయని వివరించారు. యువత జీవితం విలువను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రమాదం జరిగిన మొదటి కొన్ని నిమిషాలను ‘గోల్డెన్ అవర్’గా పిలుస్తున్నామని, బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ ల కొరత లేదని వివరించారు. కొత్తగా ప్రారంభించిన అంబులెన్స్‌లను ఎనిమిది జిల్లాలకు పంపుతుండగా, వీటిలో 30 వాహనాలకు వెంటిలేషన్ సౌకర్యం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు.