Forbes List : అతను పుట్టింది పెరిగింది పల్లెలోనే.. కానీ ప్రపంచ దిగ్గజ ఫోర్బ్స్ లిస్ట్ లో అఫీషియల్ ఎగ్జిక్యూటివ్ గా చోటు సంపాదించుకున్నాడు. అతనే కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, మక్తపల్లికి చెందిన చింతం నరేందర్. ఈయన వరల్డ్ వైడ్ గా విద్యకు సంబందించి 160కి పైగా జర్నల్స్ రాశాడు. దీనికి గానూ ఢిల్లీ ప్రభుత్వం పిల్లర్ ఆఫ్ ది నేషన్ అవార్డు కూడా ఇచ్చింది.
చింతం రాములు-కనకలక్ష్మి దంపతుల కుమారుడు చింతం నరేందర్. పుట్టిన మక్తపల్లిలోనే ప్రైమరీ విద్య అభ్యసించాడు. తిమ్మాపూర్ ఎల్ఎండీ కాలనీలో పదో తరగతి వరకు చదివాడు. కరీంనగర్ లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాడు. హైదరాబాద్ కు వెళ్లిన ఆయన అక్కడే బిజినెస్ లో మాస్టర్స్ (ఎంబీఏ) చేశాడు.
ఆ తర్వాత బెంగళూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆన్ సైట్ పై యూఎస్ వెళ్లాడు. ఇటలీ, జర్మనీ, స్కాట్ లాండ్, లండన్, డెన్మార్క్, ఫ్రాన్స్ తదితర దేశాలు కూడా వెళ్లాడు. 2015 నుంచి అమెరికాలో స్థిరపడిపోయాడు. అమెరికాలో 55 కీలక అంశాలపై నరేందర్ రీసెర్చ్ చేసి ఇన్నోవేటివ్ పేటెంట్లు ప్రచురించాడు. కాన్ఫరెన్సులకు కీనోట్ స్పీకర్ గా కూడా వ్యవహరించాడు. వరల్డ్ వైడ్ జర్నల్ సంస్థలకు చీఫ్ ఎడిటర్‌గా పని చేశాడు.
విద్యా సంస్థల టెక్నికల్ కమిటీ మెంబర్‌గా నరేందర్ పని చేస్తున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ నరేందర్ కు ఇటీవల చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పట్టా అందించింది. ఎలక్ట్రానిక్ ఇన్నోవేషన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలో సీనియర్ ఎంటర్‌ఫ్రైజెస్ ఆర్కిటెక్ట్ గా స్థానం దక్కించుకున్నాడు. రీసెంట్ గా ఫోర్బ్స్ జర్నల్‌లో అఫీషియల్ ఎగ్జిక్యూటివ్ గా చోటు దక్కించుకున్నాడు.
కొన్ని రోజుల క్రితం ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ శ్రీరాం నివాస్ గోయల్ నరేందర్ కు పిల్లర్ ఆఫ్ ది నేషన్ అవార్డు అందజేశారు. మక్తపల్లికి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన నరేందర్ ను చూసి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.