Pawan Kalyan : జనసేనాని పవన్ కల్యాణ్ పై కాపుల్లో అసంతృప్తి ఉందని, జనసేనకు పదో, పరకో సీట్లు ఇస్తారని వైసీపీ సోషల్ మీడియా, మెయిన్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. చేగొండ లాంటి సీనియర్ కాపు నాయకుడి లేఖను వారు వైరల్ చేస్తున్నారు. అయితే కాపుల్లో అసంతృప్తికి ప్రధాన కారణం సీట్లు తక్కువగా కేటాయిస్తారనే ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి ఇప్పటివరకూ కాపు సామాజిక వర్గం నుంచి ఒక్క సీఎం రాలేదు. అదే వారి ఆవేదన. రాష్ట్రంలో అతి తక్కువ జనాభా ఉన్న రెడ్డి, కమ్మలే ఇప్పటి వరకూ సీఎంలుగా ఉన్నారు. బీసీ జనాభా తర్వాత అత్యంత ఎక్కువ జనాభా ఉన్న కాపులు ఇంత వరకు సీఎం పదవి చేపట్టకపోవడంపైనే వారి బాధంతా.
చేగొండి హరిరామజోగయ్య లేఖ వివరాలు ఇలా ఉన్నాయి.. రాజ్యాధికారం ధ్యేయంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించాలంటే టీడీపీ, జనసేన కలవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కానీ కాపులకు రాజ్యాధికారం దక్కాలంటే కేవలం వైసీపీ గద్దెదించి, టీడీపీని అధికారంలోకి తేవడం కాదని హరిరామజోగయ్య అభిప్రాయపడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు, కాపులకు రాజ్యాధికారం అంటే వైసీపీని గద్దెదించి, చంద్రబాబును అధికారంలోకి తేవడమా అని ప్రశ్నించారు.
టీడీపీ, జనసేనకు సీట్లు కేటాయించడం కాదని, జనసేననే టీడీపీకి సీట్లు ఇచ్చేలా పరిస్థితి ఉండాలన్నారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు కాపులు పవన్ కల్యాణ్ వెంట నడవడం లేదన్న హరిరామజోగయ్య.. జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరుగకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 40 నుంచి 60 సీట్లలో జనసేన పోటీ చేయాలని సూచించారు. అలాగే టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ కు రెండున్నర సంవత్సరాలు సీఎం పదవి ఇవ్వాలని లేఖలో హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత ప్రకటించాలని కోరారు. ఇలా కాకుండా జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరుగకపోతే.. ఆ తర్వాత జరిగే నష్టానికి చంద్రబాబు, పవన్ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ లేఖ ప్రకారం కాపుల అసంతృప్తి అంతా పవన్ కల్యాణ్ పై కాదు, టీడీపీతో పొత్తుపై కాదు. తక్కువ సీట్ల కేటాయింపు, సీఎం పదవి పంపకంపై మాత్రమే వారు ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి ఈ విషయం రెండు పార్టీల అధినేతలు చాలా జాగ్రత్తగా చర్చించాల్సిందే. ఇరు పార్టీలకు ప్రయోజనం చేకూరే విధంగా, కచ్చితంగా అధికారంలోకి వచ్చే విధంగా వ్యూహాత్మకంగా సీట్ల ప్రకటన ఉండాలి. అప్పుడే బలమైన వైసీపీని గద్దె దించగలుగుతారు. సీట్ల పంపకంపై మధ్యేమార్గం అనుసరించాలి. అదే విధంగా ఓట్ల బదలాయింపు జరుగాలంటే రెండు పార్టీల అధినేతలు ఆమేరకు శ్రేణులను, నాయకులకు మార్గనిర్దేశం చేయాలి.
అయితే సీఎం విషయంలో మాత్రం కాపుల డిమాండ్ ఉన్నా.. ఇరుపార్టీల అధినేతల నిర్ణయం మేరకు ఉంటుందని తెలుస్తోంది. సీఎం పదవి విషయంపై లోకేశ్ స్పందించినా.. ఇప్పటివరకు చంద్రబాబు, పవన్ స్పందించలేదు. మరి కాపుల ప్రధాన డిమాండ్ ను వీరు ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఎన్నికల తర్వాతనే తెలియనుంది. కాపులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తే పవన్ పై, చంద్రబాబుపై ఏదన్నా అసంతృప్తి ఉంటే దాన్ని తొలగించవచ్చు.