Pawan Kalyan:ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు చక చకా పావులు కదుపుతున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్ అనే నినాదంతో అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టాయి. `యువగళం – నవశకం` వేదిక సాక్షిగా టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులపై స్పష్టమైన వైఖరిని తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత హరిరామజోగయ్య జనసేనానిపై లేఖాస్త్రాన్ని సంధించడం ఆసక్తికరంగా మారింది.
యాచించే స్థితిని పవన్ నుంచి జనసైనికులు కోరుకోవడం లేదని, రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఇండైరెక్ట్‌గా సుతిమెత్తిని హెచ్చరికలు చేశారు. అంతే కాకుండా పవన్‌పై పలు ప్రశ్నలు సంధించారు. `చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి. ఈ నిర్ణయంలో అనుభవజ్ఞుడి నాయకత్వమే కావాలి అని పవన్ కల్యాణ్ చాలా సార్లు చెప్పారు. కనుక అందిరి మాట ఇదే అని లోకేష్‌బాబు గారు ప్రకటించారు.
లోకేష్ బాబు ఆశిస్తున్నట్టుగా పూర్తి కాలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయటానికి మీ ఆమోదం ఉందా?.. మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టటం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలని కలలు కంటున్న జనసైనికులు ఏం కావాలనుకుంటున్నారు?. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రెండే రెండు కుల నాయకులు రాజ్యమేలు తున్నారు.
80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు? మఈరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకొక దారి చూపిస్తారని, నీతివంతమైన పాలనను ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరిస్తున్న సమాధానం ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ మీ జనసైనికులు సంతృప్తికరమైన సమాధానాలు ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని కోరుతున్నాను` అంటూ హరిరామజోగయ్య ..జనసేనానిపై లేఖాస్త్రాన్ని సంధించారు. మరి దీనిపై పవన్ ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.