Kanipakam temple : కాణిపాకం ఆలయ అర్చకుడి సస్పెండ్
Kanipakam temple : శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్.సోమశేఖర్ గురుకుల్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఈవో పి.గురుప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల్ అర్చకుడిగా ఉద్యోగం పొందే సమయంలో సరైన ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఉద్యోగం పొందడం, తదనంతరం పదోన్నతులు పొందడంపై రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ కు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపారు. విచారణలో పలు ఉల్లంఘనలు గుర్తించి ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఈవో తెలిపారు. ఆలయంలో ప్రస్తుతం ఉప ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఎస్.గణేశ్ గురుకుల్ ను ఇంచార్జి ప్రధాన అర్చకుడిగా నియమించారు.
కాణిపాకం ఆలయంలో ప్రధాన అర్చకుడిని సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి. ఆయనపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయ ఈవోను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పాలకమండలి సిఫార్సులో సోమశేఖర్ గురుకుల్ తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు వెల్లడైంది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ సోమవారం ఈవో ఆదేశాలు జారీచేశారు.