Nadendla Manohar : ఏపీ రైతు బజార్లలో కిలో కందిపప్పు రూ.160 కే లభించనుంది. కిలో బియ్యం రూ.48, స్టీమ్డ్ రైస్ కిలో రూ.49 చొప్పున విక్రయించనున్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో అసాధారణంగా పెరిగిన నిత్యావసర సరకులు ధరలను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
అందులో భాగంగా సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ లో టోకు వర్తకులు, రైస్ మిల్లర్లు, సరఫరాదారులతో నిత్యావసర ధరల పెరుగుదలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం పంపిణీ చేయడంపై చర్చించారు. ఈ నెల 11 నుంచి అన్ని రైతు బజార్లలోనూ నిర్ణయించిన రేట్ల ప్రకారమే సరకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ సిద్ధార్థ జైన్, పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.వీరపాండ్యన్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మార్కెట్ లో కందిపప్పు కిలో రూ.181 ఉండగా, రైతు బజారుల్లో రూ.160కు అమ్మేందుకు వ్యాపారులు అంగీకరించినట్లు తెలిపారు. అలాగే స్టీమ్డ్ బియ్యం రూ.49కు, ముడి బియ్యం రూ.48కు అమ్మేందుకు వర్తకులు అంగీకరించినట్లు తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా వీటి విక్రయానికి తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.