Kamineni Srinivas : ఏపీ రాజకీయాల్లో ఆయనకు వివాదరహితుడిగా మంచి పేరుంది. సొంత పార్టీలోనే కాదు ఇతర పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. అంతే కాదు పార్టీల అధినేతల వద్ద మంచి గుర్తింపు ఉంది. ఇంకా చెప్పాలంటే విధేయతతో అందరివాడుగా పేరొందారు. గతంలో బీజేపీ తరుఫున ఎమ్మెల్యే గా గెలిచి ఏకంగా మంత్రి పదవిని కూడా చేపట్టారు. అప్పటి నుంచి చంద్రబాబుకు విధేయంగా ఉంటూ వస్తున్నారు. ఇకపోతే మెగా ఫ్యామిలీకి కూడా వీర విధేయుడు. ఆయనే కామినేని శ్రీనివాస్.
కామినేని శ్రీనివాస్ కు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి కేవలం 974 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో బీజేపీ నుంచి గెలిచారు. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా మంత్రి పదవి కూడా నిర్వహించారు. 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.
ఇక తాజా ఎన్నికల్లో ఆయనకు బీజేపీ సీటు దాదాపు ఖాయమే. ఏడాది కిందటి నుంచే తనకు సీటు వస్తుందనే అంచనాలో ఉన్న ఆయన అప్పట్నుంచే ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు. బీజేపీతో పాటు అనుబంధ సంఘాలకు కామినేని రక్షణ కోట అనే చెప్పాలి. ఏ అవసరమున్నా ఆయన దగ్గరకే వెళ్తారు. ఆయన కూడా సాయం కోరి వచ్చినవాళ్లందరికీ ఏ పనైనా చేసిపెడుతారు. అలా తన క్యాడర్ ను పదిలంగా ఉంచుకున్నారు. తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి దక్కింది. ఈ నియోజకవర్గం నుంచి కామినేని దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీటులో ఆయన గెలిచి.. కూటమి విజయం సాధిస్తే మంత్రి పదవి రేసులో కూడా ఆయన ఉండనున్నారు.