Narayana School : నారాయణ స్కూల్ లో కామాంధుడు.. విద్యార్థినిని లోబరుచుకుని దారుణం..
Narayana School : సమాజంలో గురువు స్థానం గొప్పది. భారతీయ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే ఇచ్చారు. పసిబిడ్డకు ప్రాణం పోసేది తల్లిదండ్రులైతే.. ఆ బిడ్డకు జ్ఞానాన్ని అందించి మంచి పౌరుడిగా తీర్చిదిద్దేది గురువే. అలాంటి గురువుల్లో కొందరు తమ వికృత చేష్టలతో ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్ ను బంగారుమయం చేయాల్సిన ఉపాధ్యాయులు కొందరు పెడదారి పట్టి సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కోవకే చెందిన ఓ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిపై కన్నేసి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఏపీలోని జరిగింది.
విశాఖలోని నారాయణ స్కూల్ లో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న దుర్గా ప్రసాద్ అనే ఉపాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయి 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మాయమాటలతో నమ్మించి లోబరుచుకుని గర్భవతిని చేశాడు.
కొద్ది రోజుల నుంచి ఆ బాలిక అనారోగ్యంతో బాధపడుతుండడాన్ని గమనించిన ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ బాలిక గర్భం దాల్చిందని నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పింది. వెంటనే ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కామాంధుడిగా మారిన ఆ ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.