JAISW News Telugu

Congress : కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కావ్య.. బీఆర్ఎస్ ను వీడుతూ సంచలన వ్యాఖ్యలు

Congress

Congress

Congress : లోక్ సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాలు అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. ఎవరు ఏ పార్టీలో  చేరుతున్నారో.. ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావడం లేదు. అప్పటిదాక జై కొట్టి మరికొద్ది సేపటికే ఇతర పార్టీలో చేరుతున్న వారు ఎందరో.. విలువలకు పాతర వేసి రాజకీయ నాయకులు చేస్తున్న నైతికత లేని రాజకీయ క్రీడలను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఇక అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ పార్టీలో పదవులు అనుభవించిన పెద్ద నేతలు అందరూ పార్టీ కష్టాల్లో ఉన్న కూడా ఏమాత్రం సానుభూతి లేకుండా ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. అధికారమే పరమావధిగా పనిచేస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కడియం శ్రీహరి, ఆయనతో పాటు కుమార్తె కావ్య,  ఆమె భర్త మొహమ్మద్ నజీర్  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో వారిద్దరూ కాంగ్రెస్ కండువాను కప్పేసుకున్నారు. వారిని కాంగ్రెస్ పార్టీలోకి నేతలు సాదరంగా ఆహ్వానించారు.

కడియం కావ్యకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. నిన్న తన అనుచరులతో సమావేశమైన కడియం శ్రీహరి తన బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. ఈ రోజు ఢిల్లీలో సీఈసీ సమావేశం ఉండడంతో వరంగల్ టికెట్ ను కడియం కావ్యకు ఇచ్చేందుకు రెడీ కావడంతో వాళ్లు ఇప్పుడే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ వరంగల్ టికెట్ ఇచ్చినా కడియం కావ్య దానిని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ..తాను పార్టీ మారితే బీఆర్ఎస్ కు భయమెందుకని ప్రశ్నించారు. పసునూరి దయాకర్, ఆరూరి రమేశ్ పార్టీ మారితే లేని అభ్యంతరం తన విషయంలోనే ఎందుకన్నారు. తన రాజకీయ జీవితంలో తనపై ఒక్క అవినీతి మరక లేదని, ఒక్క పిట్టీ కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. కాంగ్రెస్ నేతలే తన వద్దకు వచ్చి పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. తన కుమార్తె కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలపారు. కేసీఆర్ ఉద్యమకారులకు ఏమీ చేయలేదని, ఒక్క రోజు కూడా దగ్గరకి రానివ్వలేదని పలువురు కార్యకర్తలు ఈ సందర్భంగా తెలిపారు. తన కోసం పదవులు పణంగా పెట్టి వస్తున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరినీ కాపాడుకుంటానని కడియం శ్రీహరి చెప్పారు. పాత కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు.

Exit mobile version