Kachathivu Controversy : అసలేంటీ కచ్చతీవు వివాదం.. ఇప్పుడెందుకు వార్తల్లో ఉందంటే..

Kachathivu Controversy

Kachathivu Controversy

Kachathivu Controversy : లోక్ సభ ఎన్నికల ముంగిట తమిళనాడు సమీపంలోని కచ్చతీవు ద్వీపం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్న ఆదివారం ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ కచ్చతీవు దీవుల విషయాన్ని ప్రస్తావించి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..‘‘కచ్చతీవు దీవిని శ్రీలంకకు కాంగ్రెస్ ఎలా అప్పగించిందనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇది భారతీయులందరికీ కోపం తెప్పించేది. కాంగ్రెస్ ను నమ్మలేమని మరోసారి స్పష్టమైంది. భారత ఐక్యతను బలహీనపరచడం, దేశ ప్రయోజనాలకు హాని కలిగించడమే 75 ఏళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న పని’’ అని ట్విటర్ లో విమర్శించారు. దీంతో రాజకీయమంతా ప్రస్తుతం కచ్చతీవు దీవుల చుట్టే తిరుగుతోంది. బీజేపీ, ఇండియా కూటమి ముఖ్యంగా కాంగ్రెస్ మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి.

సడెన్ గా తెరపైకి ఎలా వచ్చింది?

టైమ్స్ ఆఫ్ ఇండియా ఆదివారం ప్రచురించిన ఓ కథనంతో ఈ చర్చ మొదలైంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అందించిన ఆర్టీఐ సమాచారాన్ని ఉటంకిస్తూ ఆ పత్రిక కచ్చతీవుపై కథనం ప్రచురించింది. 1974లో భారత ప్రభుత్వం మెతక వైఖరి కారణంగానే కచ్చతీవు ద్వీపం శ్రీలంకకు వెళ్లిందని ఆ కథనం ఆరోపించింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా స్పందించారు. ‘‘డీఎంకే, కాంగ్రెస్ వాళ్లకు ఏమీ తెలియనట్టుగా, అంతా కేంద్రం చేతుల్లోనే ఉన్నట్లు చూస్తున్నాయి. అంతా ఇప్పుడే జరిగినట్లు అసలు చరిత్ర లేనట్టు వ్యవహరిస్తున్నాయి. ఈ వివాదం ఎలా మొదలైందో ప్రజలకు తెలియాలి కాబట్టి చర్చకు వచ్చింది. ఈ ద్వీపానికి సంబంధించి పార్లమెంట్ లో చాలా సార్లు ప్రశ్నలు అడిగారు’’ అని చెప్పారు. తాను స్వయంగా తమిళనాడు ప్రభుత్వానికి 21 సార్లు సమాధానమిచ్చానని తెలిపారు. 1974 జూన్ లో భారత విదేశాంగ కార్యదర్శి, అప్పటి సీఎం కరుణానిధి మధ్య చర్చ జరిగింది. కచ్చతీవుపై భారత్, శ్రీలంక దేశాలవి ఎవరి వాదనలు వారివే’’ అని ఆయన చెప్పారు.

కచ్చతీవు ఎక్కడుందంటే..

తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో భారత్, శ్రీలంక భూభాగాల మధ్య ఉన్న ఒక చిన్న ద్వీపమే కచ్చతీవు. ప్రస్తుతం శ్రీలంక ఆధీనంలో ఉన్న ఈ ద్వీపాన్ని తిరిగి భారత్ లో కలపాలని తమిళనాడు నుంచి చాలా ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ద్వీపాన్ని భారత ప్రభుత్వమే ఒక ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు అప్పగించింది. భారత్ , శ్రీలంక మధ్య పాక్ జలసంధి ఉంటుంది. 1755 నుంచి 1763 మధ్య కాలంలో మద్రాస్ ప్రావిన్స్ గవర్నర్ గా పనిచేసిన రాబర్ట్ పాక్ పేరును ఈ జలసంధికి పెట్టారు.

వాస్తవానికి ఈ జలసంధిని సముద్రం అని చెప్పలేం. ఇక్కడ పగడపు దిబ్బలు (కోరల్ రీవ్స్), ఇసుక మేటలు ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతం నుంచి ఓడలు ప్రయాణించలేవు. సరిగ్గా ఈ ప్రదేశంలోనే కచ్చతీవు ద్వీపం ఉంది. రామేశ్వరం నుంచి దాదాపు 19 కిలోమీటర్లు, జాఫ్నా నుంచి దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విస్తీర్ణం 285 ఎకరాలు. గరిష్టంగా 300 మీటర్ల వెడల్పు ఉంటుంది. 1976 వరకు ఈ దీవి తనదేనని భారత్ చెప్పుకునేది. అప్పటికీ అది శ్రీలంక ఆధీనంలో ఉంది. 1974-76 మధ్య నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక అధ్యక్షురాలు సిరిమావో బండారునాయకే మధ్య చర్చలు జరిగాయి. సముద్ర సరిహద్దు ఒప్పందంపై వీరిద్దరు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో కచ్చతీవు శ్రీలంక ఆధీనంలోకి వెళ్లింది. కానీ తమిళనాడు ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించింది. శ్రీలంక నుంచి కచ్చతీవును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.

కాంగ్రెస్ ఏమంటోంది?

కచ్చతీవుపై తమను మోదీ ఇరుకున పెట్టడంతో కాంగ్రెస్ స్పందించింది. ఎన్నికలు ఉన్నాయనే దేశ సమగ్రత, జాతీయ భద్రత సమస్యలపై మోదీ ఆకస్మాత్తుగా మేల్కొన్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మోదీ ప్రభుత్వం బంగ్లాదేశ్ తో ‘సరిహద్దులకు సంబంధించి ఒప్పందం చేసుకున్నట్లే..1974లో స్నేహపూర్వక ఒప్పందం కింద కచ్చతీవు దీవిని అప్పగించారని ఖర్గే చెపపారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో స్నేహపూర్వక ఒప్పందం కింద బంగ్లాదేశ్ కు 111 ఎన్ క్లేవ్ లు ఇచ్చారని, కేవలం 55 ఎన్ క్లేవ్ లు మాత్రమే భారత్ కు వచ్చాయని గుర్తుచేశారు.

TAGS