K Keshav Rao : తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కే.కేశవరావు
K Keshav Rao : ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కే.కేశవరావు (కేకే) తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్ అఫైర్స్)గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. కేశవరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది.
బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, కేసీఆర్ కు సన్నిహితుడైన కే.కేశవరావు బుధవారం (జూలై 3) ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన తన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే తాను కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు.
రాజ్యసభ ఎంపీగా తన పదవీకాలం ఇంకా రెండేండ్లు మిగిలి ఉండగానే కేకే రాజీనామా చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యానని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశానని తెలిపారు. గతంలో కాంగ్రెస్ లోనే సుదీర్ఘ కాలం ఉన్న ఆయన పీసీసీ చీఫ్ గా పనిచేశారు.