CPI leader Ramakrishna : కరవు జిల్లాకు నీరు అందించే హంద్రీనీవాపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ప్రాజెక్టుల అంశంపై ఆయన మాట్లాడారు. నవంబరులో ప్రవేశపెట్టే బడ్జెట్ లో హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులకు ఒక్కొక్కదానికి రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే పోలవరం ఎత్తు కుదించడానికి కేంద్రం ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్యాకేజీ డబ్బులు ఎగ్గొట్టడానికి కేంద్రం ఈ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. అలాగే పోలవరం బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో పోలవరం ప్రాజెక్టు అంశంపై విజయవాడలో సమావేశం కానున్నట్లు చెప్పారు.