Justice for Babai : ట్రెండింగ్ లో ‘‘జస్టిస్ ఫర్ బాబాయ్’’.. ఏపీ రాజకీయాల్లో రాజుకున్న వేడి..

Justice for Babai

Justice for Babai, Sunitha Reddy

Justice for Babai : దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా పలు ప్రకటనలు చేసిన సునీతారెడ్డి  ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీని గెలిపించకూడదని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో హత్యలకు తావు ఉండకూడదని పిలుపునిచ్చారు.

ఈ కేసులో తాను చేస్తున్న పోరాటానికి తనకు అండగా నిలిచిన చంద్రబాబు, పవన్, రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈకేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తప్పు చేయకపోతే నిర్దోషులుగా విడుదల చేయాలని, తప్పు చేస్తే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. వీరిని రక్షించే పనిలోనే జగన్ ఉన్నారని ఆరోపించారు. సునీతా రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ, జనసేన పార్టీలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. ఇవాళ(శనివారం) ‘‘జస్టిస్ ఫర్ బాబాయ్’’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.

వైఎస్ సునీతా రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి చూద్దాం.. వైఎస్ వివేకానందరెడ్డి ఐదేళ్ల కింద హత్య చేయబడినా.. ఈ కేసు ఇంకా కొనసాగుతోందన్నారు. కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే విషయంలో తనకు ఏపీ ప్రజల మద్దతు, తీర్పు కావాలన్నారు. సాధారణంగా ఏ హత్య కేసు అయిన 4,5 రోజుల్లో తేలుతుందని, కానీ ఈ కేసు సంవత్సరాల తరబడిగా కొనసాగుతోందన్నారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నాన్న ఓడిపోయారు.. సొంత వాళ్లే మోసం చేసి ఓడించారని అనుకుంటున్నాం. ఓటమి పాలైన నా తండ్రిని మరింత అణచాలని చూశారు..’’ అని సునీతా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒక్కోసారి హంతకులు మనమధ్య ఉంటున్నా తెలియనట్లే ఉంటుందన్నారు. ఆరోజు 11.30 వరకు కూడా పెదనాన్న తమ కోసం ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నాడని అవినాష్ రెడ్డి చెప్పినప్పుడు దాని వెనుక ఉన్న అసలు విషయం నాకు అర్థం కాలేదు… మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం హంతకులు మన మధ్య తిరుగుతూ ఉంటారని అని ఆమె చెప్పారు. ఈక్రమంలోనే సీబీఐ దర్యాప్తునకు వెళ్దామని జగన్ ను అడిగానన్నారు.  అయితే జగన్ స్పందిస్తూ సీబీఐ దగ్గరికి వెళితే… అవినాష్ బీజేపీలోకి వెళ్లిపోతాడని అన్నారన్నారు.

ఏండ్లు గడుస్తున్న వివేకా హత్య కేసు తేలడం లేదని, తనకు ప్రజాకోర్టులో తీర్పు కావాలని సునీతారెడ్డి పిలుపునిచ్చారు. జగన్ ముందు సీబీఐ విచారణకు ఆదేశించినా తర్వాత ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ప్రశ్నించారు.  విలువలు, విశ్వసనీయ అని జగన్ పదే పదే చెబుతారని, మాట తప్పను, మడమ తిప్పను అంటుంటారు..మరి మా నాన్న విషయంలో ఇవన్నీ ఏమయ్యాయి? అని నిలదీశారు. హత్యా రాజకీయాలు ఉండొద్దని, జగనన్న పార్టీ వైసీపీకి ఎవరూ ఓటు వేయవద్దని కోరారు.

అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారని, జగన్ పాత్రపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. నిర్దోషి అయితే వదలేయాలన్నారు. జగన్ కేసుల వల్లే నాన్న హత్య కేసును సాగదీస్తున్నారన్నారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో తనకు తెలియదన్నారు. నాన్న హత్య విషయంలో తనకు మొదట్నుంచి షర్మిల ఒక్కరే తనకు అండగా నిలిచారన్నారు.

వైఎస్ సునీతారెడ్డి చేసిన సుదీర్ఘ ప్రెస్ మీట్ నిన్నటి నుంచే ఏపీ రాజకీయాల్లో వైరల్ అవుతోంది. ‘‘జస్టిస్ ఫర్ బాబాయ్’’(Justice for babai) హ్యాష్ ట్యాగ్ తో ఇప్పటికే 21వేలకు పైగా ట్వీట్లు రావడం గమనార్హం. మరో వైపు వైసీపీ కార్యకర్తలు సైతం వారికి బదులిస్తుండడంతో నెట్టింట ఏపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి.

TAGS