Jr NTR : హైకోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణం ఇదే ?

Jr NTR

Jr NTR

Jr NTR : ఎన్టీఆర్ కిలాడీ లేడీ చేతిలో మోసపోయి హైకోర్టు  మెట్లు ఎక్కడం సంచలనంగా మారింది.  తాను కొన్న స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో ఈ వివాదం స్టార్ట్ అయింది. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీతలక్ష్మీ అనే మహిళ నుంచి 2003లో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు.  అయితే ఆ భూమిని గీతలక్ష్మీ 1996లోనే పలు బ్యాంకుల వద్ద తనఖా పెట్టి లోన్లు తీసుకున్నారు. తీసుకున్న లోన్స్ కట్టకుండా ఎగ్గొట్టారు. దాంతో ఎస్‌బీఐ, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండ్‌స్ ఇండ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్‌ కింద డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ ను ఆశ్రయించాయి.

విచారణ జరిపిన డీఆర్‌టీ.. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులుంటాయంటూ తీర్పు ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఆ స్థలంతో పాటు అందులో కట్టుకున్న ఇల్లు కూడా కోల్పోయే ప్రమాద పరిస్థితి ఏర్పడింది. దీంతో మోసం చేశారంటూ ఎన్టీఆర్ ఫిర్యాదుతో భూమి అమ్మిన గీతలక్ష్మీ పై కేసు నమోదు అయింది. అదే సమయంలో డీఆర్టీ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. డీఆర్‌టీ ఆర్డర్‌ కాపీ అందుబాటులో లేకపోవడంతో టైం కావాలంటూ ఎన్టీఆర్ తరఫు న్యాయవాది కోరారు.   తదుపరి విచారణను వెకేషన్‌ బెంచ్‌ ముందు పోస్టు చేయాలని విజ్ఞప్తి చేసినా అందుకు కోర్టు  నిరాకరించింది. కేసు విచారణను జూన్‌ 6కు వాయిదా వేసింది.

భూవివాదాన్ని పరిశీలిస్తే..  ఎన్టీఆర్ ను  గీత అనే మహిళ ఘోరంగా మోసం చేసినట్లు అర్థమైపోతుంది. బ్యాంకుల్లో తనఖా పెట్టిన విషయాన్న దాచి ఎన్టీఆర్ కు ఫ్లాట్ అమ్మింది.  ఏ వివాదం లేదనుకున్న ఎన్టీఆర్ ఆ స్థలం కోసం కోట్లు చెల్లించడమే కాకుండా.. ఇల్లు కూడా నిర్మించారు. ఇప్పుడు మొత్తాన్ని బ్యాంకులకు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఆ బ్యాంకులు వేలం వేసి తమ లోన్లను రికవరీ చేసుకుంటాయి.

TAGS