Bigg Boss:బిగ్‌బాస్ నిర్వహకులకు షాక్.. నాగ్‌పై HRCలో ఫిర్యాదు
Bigg Boss:రీసెంట్‌గా జరిగిన బిగ్‌బాస్ సీజన్ 7 ఫినాలే తరువాత జరిగిన విధ్వంసం కారణంగా బిగ్ బాస్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిగ్‌బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు తాజాగా షాక్ ఇచ్చారు. షో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. పల్లవి ప్రశాంత్‌ని విజేతగా ప్రకటించిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో, కృష్ణానగర్ రోడ్లపై పలు ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం, కంటెస్టెంట్‌ల కార్లపై విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పోలీసులు పలు కేసులు నమోదు చేయడం తెలిసిందే.
ఈ విశ్వంసానికి ప్రధాన కారకుడిగా విజేత పల్లవి ప్రశాంత్‌ని నిర్ధారించిన పోలీసులు అతన్ని ఏ1 నిందితుడిగా, అతని సోదరుడు మహావీర్‌ని ఏ2గా, మిత్రుడిని ఏ3గా నిర్ధారించి అరెస్ట్ చేశారు. అనంతరం పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మహావీర్‌లను నాంపల్లి కోర్టులో హాజరు పరచగా, కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పడంతో పోలీసులు వారిని చంచల్ గూడా జైలుకు తరలించారు. శనివారనం విడుదలైన ప్రశాంత్ తనని టార్గెట్ చేసిన వారిపై పరువు నష్టం దావా వేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే బిగ్‌బాస్ కారణంగా న్యూసెన్స్ క్రియేట్ కావడం, ప్రభుత్వ ఆస్తులపై అభిమానులు విధ్వంసానికి పాల్పడటంతో జూబ్లీ హిల్స్ పోలీసులు బిగ్‌బాస్ నిర్వాహకులు ఎండెమోల్ షైన్ ఇండియాకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ అనంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పోలీసులు 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జునపై HRCలో ఫిర్యాదు నమోదైంది. ప్రముఖ లాయర్ అరుణ్ కుమార్ HRCలో నాగార్జునపై ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.