JAISW News Telugu

TDP-Janasena Joint Manifesto : ఇక ఉమ్మడి మేనిఫెస్టో.. టీడీపీ-జనసేన నిర్ణయం

TDP-Janasena Joint Manifesto

TDP-Janasena Joint Manifesto

TDP-Janasena Joint Manifesto : ఏపీలో టీడీపీ-జనసేన జత కట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి.  రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలు, ఎన్నికల ప్రణాళిక రూపకల్పన తదితర అంశాలపై ఒకే విధానంపై ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై రెండు పార్టీలు దృష్టి పెట్టాయి. ఆయాపార్టీల నుంచి ఏర్పాటైన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మొదటి సమావేశం సోమవారం జరగనుంది. టీడీపీ-జనసే నుంచి వచ్చిన ప్రతిపాదనలపై కమిటీ కూలంకశంగా చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల్లోకి కలిసి వెళ్లాలని  టీడీపీ -జనసేన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశాన్ని మంగళగిరిలోని టీడీపీ సోమవారం  కార్యాలయంలో నిర్వహించనున్నారు.

టీడీపీ మహానాడులో రాజమండ్రి వేదికగా మినీ మేనిఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళల కోసం మహా శక్తి, రైతుల కోసం అన్నదాత, యువత కోసం యువ గళం, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇంటింటికీ మంచినీరు హామీలు మినీ మేనిఫెస్టోలో ప్రకటించింది. జనసేన కూడా నాలుగైదు ప్రతిపాదనలు ముందుకి తెచ్చింది. ఇందులో రైతులు, యువత, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడం, ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం వంటి అంశాలను ముందుకు తెచ్చింది. రెండు పార్టీలు తీసుకువచ్చిన ప్రతిపాదనలపై కమిటీలో చర్చించనున్నారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం టీడీపీ-నుంచి జనసేనల నుంచి ముగ్గురు చొప్పున కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు,అధికార ప్రతినిధి పట్టాభి ఉన్నారు. ఇక జనసేన నుంచి జనవాణి సమన్వయకర్త వర ప్రసాద్, రాజకీయ వ్యవహారాల కమిటీ ముత్తా శశిధర్, జనసేన అధికార ప్రతినిధి శరత్ కుమార్ ఉన్నారు.

దూకుడు పెంచాల్సిందే..

విజయవాడలో జరిగిన జేఏసీ సమావేశంలో దూకుడు పెంచాలని ఇరు పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. ఏ కార్యక్రమం చేపట్టినా, ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా, రెండు పార్టీల ప్రతినిధులు ఉండాలని ఒప్పందానికి వచ్చాయి. ఇప్పటికే జిల్లాల వారీగా ఆత్మీయ సమావేశాలు ముగిశాయి. ఇక నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు జరపాలని జేఏసీ భేటీలో నిర్ణయించారు. నేటి నుంచి ఈ నెల 16 దాకా  మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

18 నుంచి క్షేత్రస్థాయిలోకి..

ఈ నెల 18 నుంచి ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేయాలని రెండు పార్టీలు జేఏసీలో నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానంగా రోడ్ల సమస్యపై నవంబర్  18,19 తేదీల్లో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి. వీలైనంత తొందరగా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని రెండు పార్టీల నేతలు ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తూనే మేనిఫెస్టోపై ప్రచారం చేయాలని రెండు పార్టీలూ తుది నిర్ణయిం తీసుకున్నాయి.

Exit mobile version