Joe Biden : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ తప్పుకున్నారు. ఈ మేరకు బైడెన్ స్వయంగా ఆదివారం తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దేశంతో పాటు డెమోక్రటిక్ పార్టీ ప్రయోజనాల కోసం అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు 81 ఏండ్ల బైడెన్ ప్రకటించారు. దేశాధ్యక్షుడిగా 2025, జనవరి వరకు ఉన్న తన పూర్తి పదవీ కాలం కొనసాగుతానని స్పష్టం చేశారు. గత నెల ట్రంప్ తో జరిగిన డిబేట్ లో తడబాటు, ఇతరత్రా అంశాత నేపథ్యంలో అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిి పెరగడంతో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్న క్రమంలో డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిగా ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్ పేరును బైడెన్ ప్రతిపాదించారు. 2020లో ఉపాధ్యక్ష నామినీగా కమలా హారిస్ ను ఎంపిక చేస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకున్నానని, అది తాను తీసుకున్న బెస్ట్ నిర్ణయమని బైడెన్ పేర్కొన్నారు. ఆమె ఒక అద్భుతమైన భాగస్వామి అని కొనియాడారు. పార్టీ నేతలు, అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి, ట్రంప్ ను ఓడించాలని ఈ సందర్భంగా ఆయన డెమోక్రాట్లకు పిలుపునిచ్చారు. అధ్యక్ష బరి నుంచి తప్పుకోవడంపై తాను జాతినుద్ధేశించి తర్వాత ప్రసంగిస్తానని బైడెన్ పేర్కొన్నారు.