Congress manifesto 2024 : రాబోయే సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. ఇప్పటికే పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉందనే చెప్పాలి. ఈసారి ఎన్నికల్లో గెలవకుంటే ఆ పార్టీకి మరింత గడ్డు పరిస్థితి ఎదురుకానుంది. దీంతో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేసింది. బీజేపీని ఓడించడమే ధ్యేయంగా ఈ కూటమి ఎన్నికలకు సిద్ధమైంది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను రిలీజ్ చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు ‘న్యాయపత్ర’ పేరుతో ఢిల్లీలో మ్యానిఫెస్టో ప్రకటించారు. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై దీనిని రూపొందించారు. ఖర్గే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ మ్యానిఫెస్టోను పేదలకు అంకితం చేస్తున్నామని, దేశ రాజకీయ చరిత్రలో న్యాయ పత్రాలుగా దీనిని ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో అందిస్తామన్న ఐదు న్యాయాలు, 25 గ్యారెంటీలు ఇందులో ఉన్నాయన్నారు.
మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం మాట్లాడుతూ..గత పదేళ్లుగా అన్ని రకాల న్యాయాలు ప్రజలకు అందలేదని విమర్శించారు. పదేళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చేలా మ్యానిఫెస్టోను సిద్ధం చేశామన్నారు. వర్క్ , వెల్త్, వెల్ఫేర్ (ఉద్యోగాలు, సంపద, సంక్షేమం)ను ప్రజలకు అందిస్తామన్నారు.
కీలక హామీలు..
– యువ న్యాయ్ కింద ప్రతీ విద్యావంతుడికి అప్రంటీస్ గా పనిచేసే అవకాశం కల్పించడం. దీని కోసం ఒక్కొక్కరిపై లక్ష రూపాయలు వెచ్చిస్తారు.
-మహిళా న్యాయ్ కింద పేద ఇంటి ఆడవారికి లక్ష సాయం.
-కిసాన్ న్యాయ్ కింద రైతులకు రుణమాఫీ, ఎంఎస్పీ చట్టాలకు హామీ.
-శ్రామిక్ న్యాయ్ కింద ఉపాధి హామీ పథకంలో కనీసం రూ.400 వేతనం.
– హిస్సేదార్ న్యాయ్ లో సామాజిక, ఆర్థిక అసమానతల కోసం జాతీయ జనగణన చేపడుతారు.
– రక్షా న్యాయ్ కింద విదేశీ వ్యవహారాల్లో కూడా మార్పులు తీసుకురానున్నారు.
మరికొన్ని కీలక హామీలు:
– జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా
– అగ్నిపథ్ పథకం రద్దు
– రైట్ టూ అప్రంటీస్ చట్టం
-మహాలక్ష్మీ పథకం కింద పేద మహిళకు ఏటా రూ.లక్ష సాయం
– ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజుల రద్దు
– మార్చి 15 నాటికి ఉన్న విద్యా రుణాల మొత్తం రద్దు చేస్తాం. ఆ సొమ్మును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది.
-మైనార్టీలకు వస్త్రధారణ, ఆహారం, భాష, పర్సనల్ లాను ఎంచుకునే హక్కు
– తప్పుడు వార్తల నియంత్రణకు 1978 నాటి ప్రెస్ కౌన్సిల్ ఇండియా చట్ట సవరణ.