Namaste Telangana : నమస్తే తెలంగాణ.. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పుట్టింది. తెలంగాణ ఉద్యమాన్ని బలంగా చూపించగలిగింది.. వెన్నుదన్నుగా నిలిచింది.. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉద్యమ సమయంలో ఆ పత్రిక.. తెలంగాణ జాతి మానస పుత్రిక అని కూడా కొనియాడబడింది. ఆ తర్వాత తెలంగాణ రావడం.. టీఆర్ఎస్ అధికారంలోకి రావడం.. కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండడం..ఇక నమస్తే దశాబ్ద కాలం పాటు తన ప్రభను చాటుకుందనే చెప్పాలి.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కమర్షియల్ యాడ్స్, పొలిటికల్ యాడ్స్, గవర్నమెంట్ యాడ్స్ బాగానే వచ్చాయి. బీఆర్ఎస్ సొంత పత్రిక కావడంతో వార్తలన్నీ ఆ పార్టీవే ఉండేవి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత వార్తలకే ఎక్కువ కవరేజీ ఇచ్చేది. ఇక తెలంగాణ కవులు, భాష, సంస్కృతి, సంప్రదాయాలను కూడా మిగతా పత్రికలకు భిన్నంగా అందిచేంది. ఆ రకంగా తెలంగాణకు సాహిత్య పరంగా సేవ చేసిందనే అనుకోవాలి. విద్యకు సంబంధించి కూడా మిగతా పేపర్లకు భిన్నంగా ‘నమస్తే తెలంగాణ’ బాగానే కవర్ చేసేది. కాకపోతే పేపర్ మొత్తం బీఆర్ఎస్ వార్తలతోనే నిండిఉండేది. అధికారం వాళ్లదే కనుక తప్పదు.
ఇక మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి.. ఆ ప్రభావం ‘నమస్తే తెలంగాణ’పై పడింది. ఆ సంస్థ ఉద్యోగుల్లో అలజడి రేగుతోంది. ఇప్పటికే 20శాతం ఉద్యోగులను వివిధ కారణాలు చెప్పి తీసివేయించారని తెలుస్తోంది. కొత్తగా ఎవరినీ ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుందట. అలాగే డెస్కుల్లోనూ పలు మార్పులు చేస్తున్నారట. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యారట.
ఇక ఈ పత్రికలో ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఠంఛన్ గా పడేవి. అయితే డిసెంబర్ నెల జీతం పైసలు ఇంకా ఉద్యోగుల అకౌంట్లలో జమ చేయలేదని అంటున్నారు. గత 12, 13సంవత్సరాల్లో ఇలా ఎప్పుడూ జరగలేదట. కానీ అధికారం కోల్పోయి నిండా నెల కూడా కాకముందే సిబ్బందిని తగ్గించడం, జీతాలు వేయకపోవడం.. పై ఉద్యోగులు గుర్రుమంటున్నారట. పదేండ్లు అధికారంలో ఉన్న పార్టీ పత్రికనే కదా అన్నీ నష్టాలు వచ్చాయా? అని ప్రశ్నిస్తున్నారట. పత్రిక లాభాల్లో ఉన్నప్పుడు ఏమైనా ఇంక్రిమెంట్లు ఇచ్చారా? జీతాలు పెంచారా?..అలాంటప్పుడు అధికారం కోల్పోయి నెల కాకముందే తమను ఇంతగా ఇబ్బంది పెడుతారా? అని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారని సమాచారం.