Job Lost : లోన్లు, ఈఎంఐల గురించి ఉద్యోగులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈ పదాలు చాలా సుపరిచితం. వచ్చే జీతంలో పొదుపు పాటించడం, క్రమబద్ధంగా డబ్బును వాడుకోవడం ఉద్యోగులకు అవసరం. అయితే ఇల్లు కట్టుకోవాలన్నా.. కారు కొనుక్కోవాలన్నా..ఏవైనా గృహోపకరణాలు కొనడానికి ఈఎంఐలు, లోన్లను తీసుకుంటారు. ప్రతీ నెలా తమ జీతంలో నుంచి డబ్బులను ఈఎంఐల రూపంలో అప్పు ఇచ్చిన సంస్థలకు చెల్లిస్తుంటారు. అయితే ఏదైనా కారణాల వల్ల ఉద్యోగం పోయిందనుకోండి. అప్పుడు వారి మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో అనుభవిస్తే కాని తెలియదు.
గత ఏడాది కాలంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల తొలగింపు లేదా లే ఆఫ్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేలాది మందిని తొలగిస్తున్నాయి. ఇలా ప్రతీ నెల ఠంఛన్ గా వచ్చే జీతం ఆగిపోవడంతో కట్టాల్సిన లోన్లు, ఈఎంఐలు వారికి భారం అవుతాయి. దీంతో చాలా మంది ఈఎంఐలు చెల్లించలేక.. కొత్త ఉద్యోగం వచ్చే వరకు ఈఎంఐలు ఎలా చెల్లించాలి అనే ఆలోచనతో మానసిక క్షోభకు గురవుతుంటారు. అయితే ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉంది. దీన్ని ఫాలో అయితే ఉద్యోగం పోయినా ఏ టెన్షన్ ఉండదు.
ప్రస్తుత రోజుల్లో అనేక బీమా కంపెనీలు, బ్యాంకులు ఎన్ ఎఫ్ సీలు మీ జీతం, ఉద్యోగానికి బీమా చేస్తున్నాయి. అదే జాబ్ లాస్ ఇన్సూరెన్స్. ఇది జీవిత బీమా యొక్క యాడ్-ఆన్ ఫీచర్. ఇది క్రెడిట్ రక్షణ జీవిత బీమా రూపంలో అందుబాటులో ఉంటుంది. దీనిని కొన్ని బీమా కంపెనీలు జీవిత బీమాతో పాటు విక్రయిస్తుండగా, కొన్ని విడివిడిగా అందిస్తున్నాయి. దీని ద్వారా ఉద్యోగం కోల్పోతే క్రెడిట్ కార్డు బిల్లు, ఇల్లు లేదా ఆటో లోన్ ఈఎంఐ చెల్లించవచ్చు.
కంపెనీలు ఉద్యోగ నష్ట బీమాకు ప్రతీ ఒక్కరిని అర్హులుగా పరిగణించవు. పూర్తి సమయం పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఈ బీమా ఇవ్వబడుతుంది. ఈ రకమైన బీమా పదవీ విరమణ పొందిన వారికి, నిరుద్యోగులకు, స్వయం ఉపాధి, తాత్కాలిక ఉద్యోగాలు చేసేవారికి ఇవ్వబడదు. ఇది కాకుండా బీమా కంపెనీలు వయస్సు విషయంలో కూడా కొన్ని పరిమితులను విధిస్తాయి.
అయితే సాధారణంగా జాబ్ లాస్ ఇన్సూరెన్స్ అంటే మీ నుంచి 3నుంచి 4 ఈఎంఐలను చెల్లించవచ్చు. అతను 3 నుంచి 4 నెలల్లో కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవల్సి ఉంటుంది. అప్పటి వరకు కంపెనీలు మీ ఈఎంఐ చెల్లిస్తాయి. అంటే జాబ్ లాస్ ఇన్సూరెన్స్, ఒక విధంగా మీకు తాత్కాలికంగా ఈఎంఐ చెల్లింపు సౌకర్యాన్ని కల్పిస్తుంది.
వీటి ప్రీమియం మీ ప్రాథమిక బీమా ప్రీమియంలో 3 నుంచి 5 శాతం వరకు ఉంటుంది. ఉదాహరణకు మీరు హోమ్ లోన్ తీసుకుని, జీవిత బీమాను పొందినట్లయితే.. దీని వార్షిక ప్రీమియం రూ.10వేలు అయితే.. జాబ్ లాస్ ఇన్సూరెన్స్ కోసం రూ.300-500వరకు ప్రీమియం చెల్లించాల్సి రావొచ్చు. అయితే హోమ్ లోన్ మొత్తం కాలానికి ఇది కవరేజ్ ఇవ్వదు. తొలి 5 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది.