Jerry at lunch : భోజనంలో జెర్రి.. హోటల్ సీజ్ చేసిన అధికారులు
Jerry at lunch : విజయవాడలోని కాకినాడ సుబ్బయ్య హోటల్లో దారుణ ఘటన వెలుగు చూసింది. భోజనం చేసేందుకు వెళ్లిన ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. అతను తింటున్న అన్నంలో జెర్రీ కనిపించడంతో కస్టమర్ షాక్ అయ్యాడు. అదే సమయంలో సెంట్రల్ హెచ్ఆర్సీ ఇన్ఛార్జ్ చైర్మన్ విజయ భారతి హోటల్లో భోజనం చేస్తున్నారు. హోటల్ సిబ్బంది తీరుపై ఆమె సీరియస్ అయింది. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. కార్పొరేషన్, ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్‌ను తనిఖీ చేసి సీల్ వేశారు. నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు.
విజయవాడలోని కాకినాడ సుబ్బయ్య హోటల్ చాలా ఫేమస్. అలాంటి హోటల్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భోజనంలో జెర్రీ కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. అదే సమయంలో కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ విజయభారతి సయానీ కూడా హోటల్లో భోజనం చేసేందుకు వచ్చారు. భోజనం చేస్తుండగా.. తాను తింటున్న అన్నంలో జెర్రీ కనిపించిందని ఓ కస్టమర్ ఫిర్యాదు చేయడంతో హోటల్లో తింటున్న మిగతా కస్టమర్లంతా షాక్ అయ్యారు. హోటల్ నిర్వాహకులపై విజయభారతి సీరియస్ అయ్యారు. వెంటనే గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అటు స్థానికులు సైతం పోలీసులకు ఫోన్ చేశారు. భోజన శాంపుల్స్ ను అధికారులు సేకరించి ల్యాబ్ కు తరలించారు. సుబ్బయ్య హోటల్ లో వెలుగుచూసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.