Raj Pakala : జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి మాజీమంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల మోకిల పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. న్యాయవాదితో పాటు ఆయన పీఎస్ కు వచ్చారు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీకి సంబంధించి విచారణకు హాజరు కావాలని ఇటీవల రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాజ్ పాకాలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
జన్వాడ ఫామ్ హౌస్ పై ఇటీవల సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడుల చేశారు. ఇక్కడి రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి తనిఖీ చేపట్టారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులు మద్యం పార్టీ నిర్వహించారు. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు, రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చారు.