Janasena : ఎన్నికల వేళ ఒక్కొక్కరు ఒక్కో విధమైన వ్యూహాలను రచిస్తుంటారు. కొందరు రాష్ట్ర అభివృద్ధి, కొత్త ఆర్థిక విధానాలు, ప్రయోజనకరమైన సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళతారు. ఇక కొందరు ప్రత్యర్థి పార్టీలను, ఆ నేతలను పరువును, ఇమేజ్ డ్యామేజీ చేసి వికృత ఆనందం పొందుతూ ప్రచారానికి బరితెగిస్తారు. తెలుగు నేలపై ఇలాంటి రాజకీయాలకు కొదువ లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో మరీ ఎక్కువ.
పవన్ కల్యాణ్ జనసేనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ‘సాక్షి’ విషప్రచారం మొదలుపెట్టింది. ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి సీట్లు అమ్ముకున్నారనే ప్రచారాన్ని మొదట వైఎస్సార్ ప్రారంభించగా, ఇప్పుడు జనసేనపై సాక్షి అదే ఆటను మొదలుపెట్టింది. వైజాగ్ లో సుందరపు సోదరులకు పవన్ కల్యాణ్ సీట్లు ఖరారు చేశారని మొన్న జనసేన నుంచి లీకైంది. అనకాపల్లి టికెట్ సుందరపు విజయ్ కుమార్ కు, ఆయన సోదరుడు సతీశ్ కు గాజువాక టికెట్ దక్కినట్లు ప్రచారం జరిగింది.
ఇక వీరికి టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయని లీక్ వార్త బయటకు రాగానే జనసేనను నైతికంగా దెబ్బతీసేందుకు పొంచి ఉన్న అధికార పార్టీకి ఓ ముడిసరుకు దొరికింది. దీంతో అనేక కథనాలు వండివారుస్తోంది. నాగబాబు కూతురు నిహారిక కొణిదెల సినిమాకు సతీశ్ నిధులు సమకూరుస్తున్నాడంటూ మొన్న సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. వరుణ్ తేజ్ డెస్టినేషన్ మ్యారేజ్ కు సుందరాపు సతీశ్ నిధులు సమకూర్చాడంటూ వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.
నాగబాబు కారు సతీశ్ కు చెందినదని, అనకాపల్లిలో నాగబాబు తాత్కాలిక నివాసంతో పాటు ఆయన ఎన్నికల ఖర్చులను కూడా ఆయనే భరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ రెండు సీట్లతో మొదలైన ప్రచారం త్వరలోనే సాక్షి, వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నాయి.
గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. అయినా రెండు పెద్ద పార్టీల మధ్య ప్రజారాజ్యం ఓ రకంగా చెప్పాలంటే మంచి ఫలితాన్నే రాబట్టింది. 18 సీట్లు, 18 శాతం ఓట్లను రాబట్టగలిగింది. ప్రజారాజ్యంపై ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారం, తెలంగాణ ఉద్యమం..వంటి వివిధ కారణాల వంటివి లేకుంటే ప్రజారాజ్యం మరిన్ని మంచి ఫలితాలు రాబట్టేది. ఇప్పుడు జనసేనను టార్గెట్ చేసుకుని అధికార పార్టీ అదే స్ట్రాటజీని అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ గమనించి వాటిని మొగ్గలోనే తుంచివేయాలి. లేకుంటే వైసీపీ విష ప్రచారం మరింత ముదిరిపోతుంది.