SVSN Varma : పవర్ లో ఉంటే ఆ మజానే వేరు.. రేసుగుర్రం సినిమాలో విలన్ చెప్పే డైలాగ్ ఇది. అధికారంలో ఉంటే మనం ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. పవర్ చేతిలో ఉంటే ఎవడినైనా ఓ ఆట ఆడించొచ్చు. గతంలో వైసీపీకి ఇలాగే అధికారం దక్కడంతో ఆ పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. ఐదేళ్లు తిరిగేసరికి జనాలు అందుకు తగిన గుణపాఠం చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కనీవినీ ఎరుగని రీతిలో విజయం దక్కింది. ఏకంగా 165 సీట్లతో రికార్డు గెలుపు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కూటమి నేతలకు భవిష్యత్ బంగారుమయంగా కనిపిస్తోంది. ఇక తమకు తిరుగులేదన్న భావన ఆ పార్టీల్లోని నాయకుల్లో బలపడింది. ఎన్నికల్లో ప్రత్యర్థి కనుమరుగు కావడంతో, తమలో తామే కొట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ పిఠాపురంలో టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన దాడి. కూటమిలో భవిష్యత్ పరిణామాలు ఎలా వుంటాయో ఆయన పై దాడి జస్ట్ ట్రైలర్ మాత్రమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన కార్యక్తరలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో పాటు వర్మ కారు ధ్వంసం అయింది. దాడికి నిరసనగా టీడీపీ నేత వర్మ నేతృత్వంలో ఆందోళనకు దిగారంటే పరిస్థితి ఎంత తీవ్రస్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా అధికార బాధ్యతలు తీసుకోకుండానే.. ఇలా గొడవలకు తెగబడ్డారంటే భవిష్యత్ లో టీడీపీ, జనసేన మధ్య యుద్దం ఎలా వుండనుందోనన్న సందేహాలు వెల్లడవుతున్నాయి. గొల్లప్రోలు మండలం వన్నెపైడి గ్రామానికి తమకు తెలియకుండా ఎందుకొచ్చావని వర్మను అ గ్రామానికి చెందిన జనసేన నాయకులు నిలదీశారు. తమకు తెలియకుండా తమ గ్రామంలో ఇతర పార్టీల వారిని ఎందుకు కలుస్తున్నారు? అని ప్రశ్నించడంతో టీడీపీ నేత వర్మ షాక్ అయ్యారు.
మీకు చెప్పాల్సిన పనిలేదని వర్మ కోపంగా చెప్పడంతో గొడవ మొదలైంది. తనను చంపేస్తారేమోనన్న భయంతో వర్మ అక్కడి నుంచి కారులో పరారయ్యారు. జనసేన కార్యకర్తలు ఇంతటి దారుణానికి ఒడిగడతారని ఆయన ఊహించి ఉండరు. అల్లరి మూకలను జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నారంటూ వర్మ మండిపడ్డారు. జనసేన నేతలు తనను చంపడానికి ట్రై చేశారని ఆరోపించారు. గత తొమ్మిది నెలలుగా ఉదయ్ తనను వేధిస్తున్నాడని, జనసేనకు పని చేయడం తన ఖర్మ అని ఆయన వాపోయాడు.
ఇదిలా ఉంటే కూటమి పార్టీల కార్యకర్తలు సంయమనం పాటించాలని..మున్ముందు ప్రత్యర్థి పార్టీ, మీడియా కూటమి కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయవచ్చని, అందుకే జాగ్రత్తగా ఉండాలని సీనియర్ నేతలు సూచిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ పొత్తు పొడిచిందని..అనవసర వివాదాలు సృష్టించకుండా అంతా కలిసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నారు.