CPI leader Narayana : జమిలి ఎన్నికలు ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధం: సీపీఐ నేత నారాయణ

CPI leader Narayana
CPI leader Narayana : జమిలి ఎన్నికలు ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధమని సీపీఐ నేత నారాయణ అన్నారు. హైదరాబాద్ మఖ్దూం భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో దుష్ట సంస్కృతిని ప్రధాని మోదీ తీసుకొచ్చారని విమర్శించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. ఆ రెండు రాష్ట్రాల్లో గెలిస్తే జమిలి ఎన్నికల దిశగా వెళ్లాలని మోదీ చూస్తున్నారన్నారు. ఆ ఎన్నికలు ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధమని చెప్పారు.
మహారాష్ట్రలో కూటమి పొత్తులో భాగంగా ఒక స్థానంలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. జార్ఖండ్ లో ఒంటరిగా బరిలో నిలిచామని నారాయణ చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ 12 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నారన్నారు. కోర్టులకు కూడా ఆయన వెళ్లడం లేదని ఆక్షేపించారు. మోదీ, అమిత్ షా సహకారంతోనే జగన్ బయట ఉన్నారని ఆరోపించారు. తెలంగాణలో కుల గణనపై నారాయణ ఈ సందర్భంగా స్పందించారు. కుల గణనతో రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడినవారిని ప్రోత్సహించవచ్చని, కానీ దీనికి 75 ప్రశ్నలు ఎందుకని ప్రశ్నించారు. యాప్ రూపొందిస్తే ఎవరి ఫామ్ వాళ్లే పూర్తి చేస్తారన్నారు.