Jaiswaraajya TV Poll : కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం పూర్తికావడంతో ఏ క్షణమైన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీలో మొదటి విడతలోనే ఎన్నికలు జరుగుతాయని అధికారులు చెప్తుండడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అప్రమత్తయ్యాయి. ఇప్పటికే అధికార వైసీపీ మూడొంతులకు పైగా అభ్యర్థులను ప్రకటించింది. మిగతా అభ్యర్థులను కూడా త్వరలోనే ప్రకటించేందుకు సిద్ధమైంది. టీడీపీ, జనసేన కూడా ఇవాళ తమ అభ్యర్థులను కొంతమందిని ప్రకటించాయి.
ఏపీ రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలు అన్నింటికీ జీవన్మరణ సమస్య అని చెప్పవచ్చు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి సత్తాచాటాలని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈక్రమంలో పలు సర్వేలు జననాడీని పట్టే ప్రయత్నం చేశాయి. తాజాగా ఇవాళ ప్రముఖ జైస్వరాజ్య టీవీ సోషల్ మీడియాలో ఓపినియన్ పోల్ నిర్వహించింది. దీనిలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ఈ పోల్ ను ‘‘ఈసారి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయ్ అని మీరు భావిస్తున్నారు’’ అనే క్యాప్షన్ తో నిర్వహించారు. దీనిలో వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో ఏ అభిప్రాయం ఉందో విస్పష్టంగా అర్థమైపోయింది. రాబోయే ఎన్నికల్లో ‘వైనాట్ 175’ టార్గెట్ తో ముందుకెళ్తున్న వైసీపీ నేతలకు ఈ ఫలితాలు చూస్తే గుండె ఆగిపోయేంత పనవుతుందని మాత్రం చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ప్రమాణికంగా, జెన్యూన్ ఓపినియన్ పోల్ ఇదని చెప్పవచ్చు. ఇందులో జనాలు ఎలాంటి బలవంతం లేకుండా, స్వచ్ఛందంగా, ఏ పక్షపాతం లేకుండా తమ మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పారని నమ్మవచ్చు.
ఓ రకంగా చెప్పాలంటే ఈ పోల్ జగన్ పాలనపై రెఫరెండం, రాబోయే ఎన్నికలకు మోడల్ అనికూడా చెప్పవచ్చు. ఇందులో వచ్చిన ఫలితాలు ఇలా ఉన్నాయి.
జగన్ పార్టీకి 1-30 సీట్లు వస్తాయని 68శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. 30-60 సీట్లు వస్తాయని 19శాతం మంది ప్రజలు చెప్పారు. ఇక 60-100 సీట్లలోపు వస్తాయని కేవలం 13 శాతం మంది ప్రజలు చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఓపెన్ పోల్ లో స్వేచ్ఛగా ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పారు.
175 సీట్లు గెలుస్తామని గతంలో ఢంకా బజాయించి చెప్పిన వైసీపీకి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటైన తర్వాత కనీసం 30 సీట్లైనా గెలుస్తామా అనే సందేహం మొదలైంది. ఇదే అభిప్రాయం జనాల్లోనూ వచ్చింది. అందుకే దాదాపు 70 శాతం ప్రజలు వైసీపీని 30 సీట్లలోపే పరిమితం చేయడం గమనించవచ్చు.