Jagan Prediction : ఫలితాలపై జగన్ అంచనా..ఆయన ఊహించింది జరిగితేనే..
Jagan Prediction : ఏపీలో ఎన్నికలు ముగిశాయి. భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి లాభం చేకూరుస్తుందో..ఎవరి పుట్టి ముంచుతుందో అనే విశ్లేషణలు నడుస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి 81.66 శాతం పోలింగ్ నమోదు కావడంతో ఇది కూటమి గెలుపు సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటేనే ఇలా భారీ పోలింగ్ నమోదు అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా పోలింగ్ సరళిని పరిశీలించిన వైసీపీ అధినేత జగన్ కు ఫలితంపై ఓ స్పష్టతకు వచ్చారు.
ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి ఓటర్లు భారీగా తరలివచ్చారని, ఇది తమకే అనుకూలిస్తుందని కూటమి అంచనా వేస్తోంది. అదే సమయంలో మహిళలు, వృద్ధులు ఓటేసేందుకు బారులు తీరడం వైసీపీలో ఆశలు పెంచుతోంది. తమ పథకాలతో మహిళల పాజిటివ్ ఓటు తమకే దక్కిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. దాదాపు 1500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి దాటే వరకు పోలింగ్ జరిగింది. అయితే అనూహ్యంగా ఏపీలో ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతిల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పోలింగ్ శాతం తగ్గింది. నియోజకవర్గాల వారీగా చూస్తే పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి.
ఇక సీఎం జగన్ పార్టీ ముఖ్యనేతలు, ఐప్యాక్ సంస్థ ముఖ్యులతో పోలింగ్ సరళిపై సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా నివేదికలతో విశ్లేషించారు. కోటి 69 లక్షల మంది పురుషులు ఓట్లు వేశారు. తమ పథకాల లబ్ధిదారులు మహిళలే కావడంతో మహిళల పాజిటివ్ ఓటు కలిసివస్తుందని తేల్చారు. అదే విధంగా టీడీపీకి కంచుకోటలుగా భావించే నియోజకవర్గాల్లో సైతం మహిళా ఓటింగ్ ఎక్కువగా ఉండడంతో ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని జగన్ భావిస్తున్నారు. అయితే ఎవరి అంచనాలు ఎలా ఉన్నా జూన్ 4 విడుదలయ్యే ఫలితాలే విజేతను తేల్చనున్నాయి.