Operation Janasena : మరో వారం, పది రోజుల్లోనే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. వచ్చే నెల మూడు లేదా నాలుగో వారంలో ఎన్నికలు ఉండే అవకాశం ఉండడంతో ఏపీలోని పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెంచుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుతో గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోవాలని అధినేతలు చంద్రబాబు, పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడ ఎవరు మెజార్టీ సీట్లు సాధిస్తే వారికే అధికారం దక్కడం ఖాయం. కూటమి వ్యూహాలకు చెక్ పెట్టేందుకు వైసీపీ రెడీ అయ్యింది. కాపు ఉద్యమ నేత ముద్రగడతో మంత్రాంగం నడిపింది. ముద్రగడ తన కుటుంబ సభ్యులతో వైసీపీలో చేరేందుకు దాదాపు ఫిక్స్ అయ్యింది. జనసేన టార్గెట్ గా జగన్ తన ఆపరేషన్ మొదలుపెట్టారు.
టీడీపీ, జనసేన పొత్తుతో వైసీపీ గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే హరిరామజోగయ్య కుమారుడిని తమ పార్టీలోకి చేర్చుకున్న వైసీపీ, ఇప్పుడు ముద్రగడ లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ గతంలోనే వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, ముద్రగడ-వైసీపీ నేతల మధ్య సీట్లపైన జరిగిన చర్చల్లో క్లారిటీ రాకపోవడంతో చేరిక ఆగిపోయింది.
ఆ తర్వాత జనసేన.. కాపు నేతలు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. స్వయంగా పవన్ కల్యాణ్ వెళ్లి ముద్రగడను ఆహ్వానించాలని భావించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన పవన్ ఆ తర్వాత ముద్రగడను కలుస్తారని జనసేన నేతలు సమాచారం ఇచ్చారు. అయితే ముద్రగడ జనసేనలో చేరడం లేదని స్పష్టత రావడంతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. ఆయన కుమారుడితో చర్చలు జరిపారు. నేరుగా తన తండ్రితోనే చర్చించాలని ఆయన వారికి సూచించారు. వరుసగా జరిగిన చర్చల ఫలితంగా ముద్రగడ ఎలాంటి షరతులు లేకుండా వైసీపీకి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించారని సమాచారం. ఈ వారంలోనే ముద్రగడ తన కుమారులతో కలిసి వైసీపీలో చేరుతారని సమాచారం.
ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ముద్రగడ పార్టీలోకి వస్తే పిఠాపురం నుంచి పవన్ పైన బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. అయితే పిఠాపురం నుంచి వంగా గీత కొనసాగుతారని పార్టీ నేతల సమాచారం. ముద్రగడ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తారని అంటున్నారు.
జనసేనలో సీట్లు రాని కాపు నేతలను వైసీపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ ముద్రగడను అస్త్రంగా ఉపయోగించుకోబోతుందని తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే ముద్రగడను రాజ్యసభకు పంపే విధంగా హామీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముద్రగడ వైసీపీలో చేరితే గోదావరి జిల్లాల రాజకీయం మరింత రసవత్తరం కావడం ఖాయం.