Jagan-BJP : ఏపీ రాజకీయాలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కీలక మలుపులు తీసుకుంటున్నాయి. వైసీపీ అభ్యర్థులను ప్రకటించి ముందుకెళ్తుండగా, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల చర్చలు నడుస్తున్నాయి. ఇది ఓ కొలిక్కి వచ్చే లోపే సీన్ లోకి జగన్ ఎంటర్ కావడంతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీ ప్రధాన ఉద్దేశం టీడీపీ ఏన్డీఏలోకి చేరడమే అని మనకు తెలిసిందే. అయితే ఆయన అక్కడ ఉండగానే హుటాహుటీన జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏలో చేరుతారన్న అంశంపై ఢిల్లీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే సిద్ధాంతాలు, ఓటు బ్యాంకుల ఆధారంగా చూస్తే బీజేపీకి, వైసీపీకి సరిపడదు. అదే చేస్తే జగన్ కు ఆత్మహత్యా సాదృశ్యమే.
జగన్ రెడ్డికి ప్రధాన ఓటు బ్యాంకు ముస్లింలు, దళితులు. వీరిలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంటుందనేది తెలిసిందే. ఇప్పుడు బీజేపీతో జగన్ కలిస్తే వారిలో ఓ 10శాతం ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లినతే జగన్ కు తీవ్ర నష్టం జరుగుతుంది. కానీ రాజకీయ సమీకరణాల కంటే అంతకు మించినవి ఎన్నో జగన్ ఆలోచనగా ఉన్నాయి. అందుకే ఎన్డీఏలో చేరేందుకు తన ఆసక్తిని బీజేపీ హైకమాండ్ ముందు పెట్టారని చెబుతున్నారు.
టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్తే ఆ తర్వాత తాను ఎదుర్కొబోయే రాజకీయ పరిణామలు ఏంటో జగన్ కు బాగా తెలుసు. అలాంటి కష్టం రాకుండా ఉండాలంటే బీజేపీ తనకు అండగా ఉండాలి. అందుకే రాజకీయంగా ఏపీలో తనకు నష్టం జరిగినా.. బీజేపీతో సఖ్యత కోసం ఎన్డీఏలో చేరేందుకు రెడీ అయ్యారని రాజకీయవర్గాలు చర్చ నడుస్తోంది. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ ముందు ఉంచారని.. ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.
బీజేపీతో శత్రుత్వం కొని తెచ్చుకోకుండా..రాజకీయంగా తనకు నష్టం జరుగకుండా చూసుకునేందుకే ఎన్డీఏ కూటమిలో చేరేందుకు జగన్ రెడీ అయ్యారని తెలుస్తోంది. అయితే జగన్ చేర్చుకునేందుకు బీజేపీ ఇష్టపడుతుందా? లేదా అనేది త్వరలోనే క్లారిటీ వస్తుంది. బీజేపీ సానుకూల నిర్ణయం తీసుకుంటే.. ఏపీ రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. బీజేపీ, వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన అన్నట్టుగా మారుతాయి. ఈ పొత్తుల వ్యవహారానికి మరికొన్ని రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.