Jagan-PM Modi : మోదీని కలిసేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు..ఎందుకంటే..
Jagan-PM Modi : రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ తహతహలాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్ల టార్గెట్ తో ముందుకెళ్తున్నారు. ఒకవేళ ఈ సారి అధికారంలోకి రాకుంటే ఎలా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఒకసారి ప్రధాని మోదీని కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానితో సమావేశం కావాలని అనుకుంటున్నారు. అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ దగ్గర భరోసా తీసుకుని కొత్త కొత్త స్కీముల్ని అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.
ఇప్పటికే కొత్త స్కీమ్ లపై పార్టీ నేతలు, సీనియర్లతో జగన్ చర్చించారు. ఈ ప్రకారం రైతు, డ్వాక్రా రుణమాఫీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే అధికారంలో ఉండి హామీలు ఇవ్వడం కన్నా పాక్షికంగా ఎన్నికలకు ముందే అమలు చేస్తే ఓటర్లను ఆకర్షించవచ్చని ఆయన ప్లాన్. దీనికి ఆర్థిక మద్దతు అవసరం. ప్రధాని మోదీని కలిసి ఇదే అంశంపై విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏపీకి ఇచ్చే అప్పు పరిమితిలో 20వేల కోట్ల రూపాయలు ఈ ఏడాది ఇస్తే..రెండు స్కీముల్ని పరిమితంగా అమలుచేసేందుకు జీవో ఇచ్చి.. కొంతమందికి రుణమాఫీ చేయాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు.
కానీ ప్రధాని మోదీ షెడ్యూల్ బిజీబిజీగా ఉంది. పదమూడో తేదీ వరకు ఆయన తీరిక లేని పర్యటనలు చేయనున్నారు. ఈ వారం రోజుల్లో ఆయన దేశం మొత్తమూ చుట్టేయనున్నారు. ఆయన పర్యటనలు ముగిసినా తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో మోదీ అపాయింట్ మెంట్ దొరకడం జగన్ కు కష్టంగా మారింది. అనుకున్నట్టు జరిగితే కేబినేట్ లో నిర్ణయాలు తీసుకుని వెంటనే జీవోలు ఇచ్చేస్తే.. ఇక ఎలక్షన్ కోడ్ వచ్చినా సమస్య ఉండదని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తే మంచి మైలేజ్ వస్తుందని అనుకుంటున్నారు.
ఇప్పటికీ ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ దొరుకుతుందన్న నమ్మకంతోనే సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ఈలోపే.. ప్రధానిని కలిసి అనుమతులు తీసుకుని ఆ తర్వాతే సిద్ధం సభను నిర్వహించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు.