Ex CM Jagan : జగన్ కేసులు రేపటి నుంచి రోజు వారి విచారణ..
Ex CM Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐకి సంబంధించి 11, ఈడీకి సంబంధించి 9 కేసులు ఉన్నాయి. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండడంతో కోర్టులో కేసులు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఆయన సీఎం కాబట్టి పనులు, సమావేశాలు, పర్యటనలు, ప్రజా పాలన నేపథ్యంలో న్యాయమూర్తులు న్యాయ పరమైన సడలింపులు ఇచ్చుకుంటూ వెళ్లారు.
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కు కేవలం 11 సీట్లు రావడం, అందునా వైఎస్ జగన్ కేవలం ఎమ్మెల్యేగానే ఉండడంతో ఇక కేసుల దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెట్టుబడుల విషయంలో భారీ అవినీతి అక్రమాలకు తెర లేపారు జగన్. ఈ కేసుల విషయమై గతంలో కొంత కాలం జైలు జీవితం కూడా గడిపారు. తన తండ్రి చనిపోయిన తర్వాత జైలులో కొంత కాలం ఉన్న ఆయన విడిపోయిన ఏపీలో పాదయాత్ర చేపట్టారు. ఆ తర్వాత వచ్చిన 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.
విజయం అనంతరం సీఎంగా కూడా పదవి నిర్వర్తించడంతో కేసులు వెనుకబడ్డాయి. ఇక ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేనే కావడంతో ఆయనపై ఉన్న కేసుల విచారణ వేగం పుంజుకోనుంది. మనీ లాండరింగ్, సీబీఐ కేసులకు సంబంధించి ప్రతీ రోజు విచారణ ఉంటుంది. అది కూడా రేపటి నుంచి (జూన్ 20) ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ కేసులను జగన్ ఎలా తట్టుకుంటాడో.. ఎలా బయటపడతాడో వేచి చూడాలి మరి.