Kishan Reddy : జగన్ అహంకారమే ఆయనను ఓడిస్తుంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy
Kishan Reddy : ఏపీ సీఎం జగన్ అహంకారమే ఆయనను ఓడిస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇచ్చిన ఉచిత పథకాలకు ఆయన ఇంట్లో కూర్చొన్నా చాలు.. గెలవాలి.. కానీ ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అనేక పథకాలు ఇచ్చినప్పటికీ గెలిచే పరిస్థితి లేదన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఓడించినట్లే, జగన్ అహంకారమే ఆయనను ఓడిస్తోందని అన్నారు. జగన్ అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు దారుణంగా ఉన్నాయన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిపై గతంలో ఫైటర్ అనే అభిప్రాయం ఉండేదని, ప్రస్తుతం అతనిపై బ్లాక్ మెయిలర్ అనే ముద్ర పడిందన్నారు. కాంగ్రెస్ క్యాడర్ ఆయనకు సహకరించడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభావం అక్కడ ఏమాత్రం లేదన్నారు.