Jagannath Treasury : ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం అప్పుడప్పుడు దానిని తెరిచి సంపద లెక్కించేవారు. 1978 తర్వాత దానిని తెరవలేదు. దీంతో ఎన్నో వివాదాలు.. అసలు తాళం ఏమైందనే అంశమే మొన్నటి ఎన్నికల్లో ప్రస్తావనకు వచ్చింది. కొత్త ప్రభుత్వం దానిని తెరవాలని నిర్ణయానికి వచ్చింది. సుమారు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న తెరవనున్నారు.
ఆభరణాలను లెక్కించి అవసరమైన వాటికి మరమ్మతులు చేయించనున్నారు. భాండాగారాన్ని తెరిచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ రెండో దఫా సమావేశం మంగళవారం పూరీలో జరిగింది. 14న భాండాగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కమిటీలోని 16 మది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
పూరీ జగన్నాథుని ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా, 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు కూడా దీన్ని సమర్థించింది.
రహస్య గదులు జీర్ణావస్థకు చేరి, వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతు చేయాలని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. 2019 ఏప్రిల్ 6న నాటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపు తెరవడానికి వెళ్లగా రహస్య గది తాళపుచెవి కనిపించలేదు. దీంతో సభ్యులు వెనుదిరిగారు. తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించింది. ఇంతలో డూప్లికేట్ తాళపుచెవి పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు.