Deputy Speaker : వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని కండీషన్లు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్ అసెంబ్లీ మొహం కూడా చూడరని ఎద్దేవా చేశారు. ప్రజలు దీనిపై పందేలు కూడా వేసుకుంటున్నారని మరింత వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారని, వైసీపీ అధినేత జగన్ కూడా వచ్చి మాట్లాడొచ్చని స్పష్టం చేశారు. ఇంట్లో కూర్చుని విమర్శిస్తాం, ఇంట్లోనే ఉండి వీడియోలు చేస్తామంటే కుదురదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఏదో ఉపద్రవం ముంచుకొచ్చిందని ఎన్‌హెచ్ఆర్సీ ఎదుట గగ్గోలు పెడుతున్న రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి మహిళలను కించపరుస్తూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెడుతున్న పోస్టులు ఎందుకు కనిపించడం లేదు అని ప్రశ్నించారు. ఆడబిడ్డల రక్షణకు బలమైన చట్టం తీసుకొచ్చే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని హోంమంత్రి వెల్లడించారు. మహిళలపై నేరాలకు సంబంధించి ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు నమోదైన 7,393 కేసుల్లో 12,115 మంది నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.