Pawan Warning : ‘‘జగన్ నీ జీవితం జైలుకు, బెయిల్ కు మధ్య ఊగిసలాడుతోంది..అమలాపురం క్లాక్ టవర్ నుంచి చెబుతున్నా.. జగన్ నీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి..నిన్ను జైలుకు పంపిస్తాం..’’అంటూ సీఎం జగన్ కు జనసేనాని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నా సినిమాలు ఆపిన రోజే చెప్పా.. ఎవరు మనల్ని ఆపేదని? మళ్లీ ఈ రోజు చెబుతున్నా కూటమి ప్రభుత్వం రాకుండా ఎవరు ఆపేది? భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం. కోనసీమను కలహాల సీమగా మార్చి..కులాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదన్నారు. జనసేన, జనసైనికులు రాష్ట్ర సంక్షేమం కోసం నిలబడతారన్నారు.
కూటమి ప్రభుత్వం వస్తుంది.. నాయకుల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నారు. జనసేన నుంచి వెళ్లిపోతే తానేం చేయలేనన్నారు. కోనసీమ అందాలు చూపించేలా ప్యాలెస్ ఆన్ వీల్స్ మాదిరి రైలు పరుగెత్తాలని, హరీశ్ ను పార్లమెంట్ కు పంపిస్తే రైలు కూత వచ్చేలా పనిచేస్తామన్నారు. ఈ ప్రాంత వాసుల ఆకాంక్షను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్నారు. వైసీపీ పాలన గురించి దళిత సమాజం ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో 32వేల మంది ఆడిపిల్లలు అదృశ్యమైతే ఈ సీఎం ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు.
ఈ ఎన్నికల్లో ఓటు బదిలీ చాలా కీలకమని, ప్రజలు గెలవాలంటే ఓటు చీలకూడదన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం రావడం తథ్యమని, జగన్ ను ఇక్కడి నుంచి తన్ని తగలేస్తున్నామన్నారు. ఏపీలోని 5 కోట్ల మందిని కాపాడడానికి త్రివేణి సంగమంలాగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పాటు చేశామన్నారు. క్లైమోర్ మైన్లు ఆయన వెళ్తున్న వాహనాన్ని లేపేస్తే కిందపడి చొక్కా దులుపుకుని, ఏమాత్రం భయం లేకుండా ముందుకు నడిచి దశాబ్దాల పాటు రాజకీయాలు నడిపిన రాజకీయ దురంధరుడు చంద్రబాబు అని, సినిమాలు చేసి కోట్లు సంపాదించుకునే జీవితం తనదన్నారు. ప్రతీ అడ్డమైనవాళ్లు తిడుతున్నా.. ఏపీ ప్రజల భవిష్యత్ కోసమే భరిస్తున్నానన్నారు. తాము అధికారంలోకి రాగానే జైభీం అనే పదానికి గౌరవం వచ్చేలా అంబేద్కర్ విదేశీ విద్య తెస్తామని చెప్పారు.