Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 150కి పైగా స్థానాలను గెలిచి వైసీపీ అధికారం చేజిక్కించుకుంది. అప్పటి నుంచి వైసీపి కొత్త అధ్యాయం ప్రారంభించింది. ఈ కొత్త రాజకీయ అధ్యాయంలో ప్రజలు, ప్రతిపక్షాలు కూడా అనేక కొత్త పాఠాలు నేర్చుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క రాజధాని సరిపోదట.. కనీసం మూడు రాజధానులు ఉండాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఆర్థిక రాజధాని ఏర్పాటు కాబోతోంది. లేదంటే విశాఖ కేంద్రంగా మళ్లీ మరో రాష్ట్ర విభజన జరిగేది. జగన్ దూరదృష్టి వలన ఆ ప్రమాదం నుంచి ఏపీ తృటిలో తప్పించుకోగలిగిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.
అలాగే జగన్ ప్రభుత్వ పాలన, పథకాలు, ఆలోచనలు, నిర్ణయాలు, విధానాలు అన్నీ ఈ ప్రపంచానికే ఆదర్శమట. కానీ ఒప్పుకోకపోవడం అజ్ఞానం, అసూయగానే పరిగణించాలట. హత్యలు చేసి పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకు తిరగడం పాత పద్ధతి. శవాలను డోర్ డెలివరీ చేయడం కొత్త పద్ధతి. హత్య కేసులో దర్యాప్తు చేసే సీబీఐ అధికారుల మీదే కేసులు వేయడం జగన్ స్టైల్. బాబాయ్ ని ఎవరు చంపారని అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే, ‘వివేకాను ఎవరు చంపారో మీకే తెలుసు’ కనుక ఓట్లు వేయాలని జగన్ అడగడం కొత్త ట్రెండ్. రాష్ట్రంలో ప్రతిపక్షాలు దేనికవి విడివిడిగా వైసీపీ బోనులోకి వచ్చి సింహానికి ఆహారంగా మారాలి. కానీ ప్రతిపక్షాలు ఈ రూల్ పాటించకుండా పొత్తులు పెట్టుకొని తోడేళ్ల గుంపులా మీద పడుతున్నాయి. ఇది మాత్రం ఏం బాగోలేదు.
వైసీపీ అభ్యర్ధులు అందరూ కడిగిన ఆణిముత్యాలు, నిరుపేదలు, వెన్నవంటి మంచి మనసున్న నోటి దురుసు ఉన్నవారే. మహాభారతంలో పద్మవ్యూహాన్ని అభిమన్యుడు ఛేదించడం రాంగ్. కనుక ఇప్పుడు అర్జునుడు ఛేదించి విజయం సాధించబోతున్నాడు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్, చివరికి తిరుమలలో కూడా మనవాళ్లే ఉండాలి. మే 13న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎంపైర్లు కూడా మనవాళ్లే కావాలి. అలా అని సజ్జల వారు కోరుకోవడం సహజమే. కానీ ఎంపైర్ ఓ టీమ్‌కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కనుక మ్యాచ్ ఫలితం వేరేలా ఉంటుందని సజ్జల ఈ అధ్యాయానికి ముగింపు మాట చెప్పేశారు. కనుక జూన్ 4న రాబోయే ఫలితాలు చూసి యావత్ దేశం ఆశ్చర్యపోబోతోందని చెప్పి జగన్ విమానం ఎక్కి నేడు విదేశాలకు వెళ్లి పోయారు. ఈ ఐదేళ్లలో ఇన్ని కొత్త విషయాలు నేర్చుకున్న ఏపీ వాసులు ఫుల్ ఖుషీగా ఓట్లు వేసి మొక్కు తీర్చుకున్నారు.