JAISW News Telugu

Jagan Strategy : పవన్, లోకేశ్, బాలయ్యపై మహిళా అభ్యర్థులను బరిలోకి దింపిన జగన్!

Jagan Strategy

Jagan Strategy

Jagan Strategy : మరికొద్ది నిమిషాల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. దీంతో ఏపీలో ఎటు చూసినా రాజకీయ వాతావరణమే కనపడుతోంది. పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటనను వీలైనంత తొందరగా ముగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వైసీపీ ఇవాళ తుది జాబితా ప్రకటించింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని దీటుగా ఎదుర్కొవాలని వైసీపీ భావిస్తోంది. అందుకే పలుచోట్ల ఎవరు ఊహించిన అభ్యర్థులను ఎంపిక చేసింది.

కూటమిలోని ప్రధాన నేతలైన పవన్, లోకేశ్, బాలయ్యలను ఎలాగైనా ఓడించాలని పావులు కదుపుతోంది. ఆమేరకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా పవన్ పై తన దృష్టిని సారించింది. ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసినా రెండు చోట్ల ఓడిపోయారు. ఈసారి కూడా పవన్ ఓడించి ఆయనకు, ఆయన పార్టీకి  రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారు.

ఒకవేళ పవన్ గెలిస్తే.. ఆయన్ను ఆపడం ఇక ఎవరితరం కాదని జగన్ కు బాగా తెలుసు. భవిష్యత్ లో పవన్ తో తన పార్టీకి ముప్పు ఎదురుకాకుండా ఉండాలంటే ఇప్పుడే పవన్ ఓడించాలి. తద్వారా పవన్ కు చెక్ పెట్టవచ్చని జగన్ భావిస్తున్నారు. అందుకే అక్కడ గతంలోనే ప్రకటించిన కాపు మహిళా నేత వంగా గీతను బరిలో దించారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలోని కాపు సీనియర్ నాయకుడు ముద్రగడను కూడా వైసీపీలో చేర్చుకున్నారు. పిఠాపురంలో కాపు సామాజిక వర్గంతో పాటు మిగతా సామాజిక వర్గాలను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక టీడీపీ అగ్రనేత లోకేశ్ కూడా గత ఎన్నికల్లో గెలవలేదు. ఈసారి కూడా ఆయన్ను ఓడించి చంద్రబాబును నైతికంగా దెబ్బతీయాలని జగన్ భావిస్తున్నారు. అందుకే మొదటినుంచి మంగళగిరిపై జగన్ కన్నేశారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే ను పక్కన పెట్టి బీసీ వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్ చార్జిగా నియమించారు.

ఆ తర్వాత ఆయన కూడా ప్రభావం చూపలేరనే అనుమానంతో రాజకీయ నేపథ్యం ఉన్న మహిళా నేత లావణ్యను బరిలోకి దించారు. మరో టీడీపీ అగ్రనేత బాలయ్యపై కూడా మరో మహిళా నేత బరిలోకి దించారు జగన్. హిందూపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా టీఎన్ దీపికకు అవకాశం ఇచ్చారు. కూటమిలోని ప్రధాన నేతలకు పోటీగా ముగ్గురు మహిళలను వైసీపీ బరిలోకి దించడం గమనార్హం.

Exit mobile version