Jagan-Pawan-Sharmila : నేడు ఒక్క చోట కలవనున్న జగన్, పవన్ కళ్యాణ్, షర్మిల.. రసవత్తర ఘట్టానికి తెర..
Jagan-Pawan-Sharmila : నేటి నుంచి సరిగ్గా రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో చివరి సారిగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల వేడి మరింత ముదురుతున్న నేపథ్యంలో ప్రముఖ పార్టీలు బహిరంగ సభలు, ప్రచార కార్యక్రమాలను శరవేగంగా నిర్వహిస్తున్నాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు దాదాపు ఒకే సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, జనసేన పవన్ కళ్యాణ్, ఏపీసీసీ షర్మిల ఒకే ప్రాంతంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ముగ్గురూ నేడు (ఏప్రిల్ 29) గోదావరి జిల్లాల్లో చురుగ్గా పాల్గొననున్నారు.
కాకినాడలో ఏపీ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్ సోదరి షర్మిల సభ నిర్వహించనుంది. జగన్ ఈరోజు మధ్యాహ్నం పి గన్నవరంలో పర్యటించనున్నారు. ఇక ఈరోజు పిఠాపురంలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.
గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరుగా ప్రజాప్రస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ ముగ్గురు పార్టీ ముఖ్యులు ఈ మధ్యాహ్నం ఒకరికొకరు సన్నిహితంగా సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఎన్నికల ఫలితాలను పార్టీకి అనుకూలంగా మార్చగల గోదావరి జిల్లాల ప్రాముఖ్యతను పరిశీలిస్తే, గోదావరి ఓటర్లను ఎవరు ఎక్కువగా ఆకర్షిస్తారో చూడాలి.
ఏపీలో ముగ్గురు ప్రముఖులు, మూడు పార్టీల అధినేతలు ఒక్క చోటుకు వస్తుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మూడు పార్టీలకు చెందిన నాయకులు జన సమీకరణ కోసం పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ కార్యకర్త ఏ పార్టీకి చెందిన వాడూ తెలియక కన్ఫ్యూజయ్యే అవకాశం లేకపోలేదని జనసమీకరణలో నాయకులు కంగారు పడుతున్నారు.