Jagan Manifesto : ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించారు. 2019లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని నమ్మబలుకుతున్నారు. మేనిఫెస్టోలో పాత పథకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. వాటి అమలుకు కట్టుబడి ఉన్నానని మరోమారు మోసం చేసేందుకు నిర్ణయించుకున్నారు. 2019-24 కాలంలో 2.70 లక్షల కోట్లు పథకాల కోసం ఖర్చు చేసినట్లు వివరించారు. చంద్రబాబు 2014-19 కాలంలో 32 వేల ఉద్యోగాలు ఇవ్వగా తన హయాంలో 2.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.
2014-19 వరకు ప్రభుత్వ పథకాలకు రూ. 70 వేల కోట్లు ఖర్చయ్యేది. చంద్రబాబు హామీల వల్ల రూ. 1.21 లక్షల కోట్లకు బడ్జెట్ పెరిగింది. చంద్రబాబు పథకాల కోసం 1.50 లక్షల కోట్లు అవసరమని చెబుతున్నారు. వైఎస్సార్ చేయూత పథకం కింద నాలుగేళ్ల కాలంలో రూ.75 వేల నుంచి రూ. 1.50 లక్షలకు పెంచుతామని ప్రకటించారు. కాపు నేస్తం కోసం రూ.60 వేల నుంచి రూ. 1.20 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
అమ్మఒడి పరిధి రూ. 15 వేల నుంచి రూ. 17 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆసరా కింద రూ. 3 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలిస్తామన్నారు. వైఎస్సార్ ఈబీసీ పథకం కింద నాలుగు విడతల్లో రూ. 45 వేల నుంచి రూ. 1.05 లక్షల వరకు పెంచుతామన్నారు. అర్హత గల వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామన్నారు.
విద్య, వైద్యం, పేదలకు ఇళ్లు, వ్యవసాయం, సామాజిక భద్రత, నాడు నేడు, మహిళా సాధికారత వంటి అంశాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న రూ. 3వేల పింఛన్ రూ. 3,500లకు పెంచుతూ హామీ ఇచ్చారు. 2028, 2029 జనవరిలో రెండు విడతలుగా పింఛన్ పెంచుతామని చెప్పారు. 66 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు.
కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగిస్తామన్నారు. రైతు భరోసా సొమ్ము రూ. 13,500 నుంచి రూ.16వేలకు పెంచారు. వచ్చే ఐదేళ్లలో రూ. 80 వేలు ఇస్తామని ప్రకటించారు. ఇలా జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పలు పథకాలను గురించి వివరించారు.