CM Jagan : ఏపీ సీఎం జగన్ అప్పులు తెచ్చి.. బటన్ల మీద బటన్లు నొక్కి ఏవో కొన్ని పథకాలు అమలుచేస్తున్నారు. అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను తేలేదు. ఉపాధి కల్పన మరిచారు. దీంతో నిరుద్యోగులు రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. వీటిని పక్కన పెట్టి ఆదాయం పెంచుకోవడానికి పేదలు, మధ్య తరగతి జనాల మీద పన్నుల భారం మోపుతున్నారు.
తాజాగా పెళ్లి చేసుకునే హిందూ జంటలకు షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. రిజిస్ట్రేషన్ల చార్జీలను భారీగా పెంచింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం 1955 హిందూ వివాహ రిజిస్ట్రేషన్ చట్టానికి సంబంధించి 1965 మార్చిలో జారీ చేసిన ఫీజులను సవరిస్తూ జీవో విడుదల చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
సాధారణ వివాహ నమోదు పాత ఫీజు రూ.200 ఉండగా కొత్త ఫీజు రూ.500లకు పెంచారు. వివాహ వేదిక వద్దకే సబ్ రిజిస్ట్రార్ వస్తే పాత ఫీజు రూ.210 ఉండగా కొత్త ఫీజు రూ.5,000లు చేసింది. సెలవు రోజుల్లో వివాహ నమోదు కొత్త ఫీజు ఏకంగా రూ.5,000లకు పెంచింది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రికార్డుల పరిశీలన ఫీజు పాతది రూ.1 ఉండగా.. ప్రస్తుతం వంద రూపాయలకు పెంచారు.
అలాగే ఇక ఈ ప్రక్రియ అంతా ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే ఇది ప్రయోగాత్మకంగా అవుతున్నప్పటికీ..త్వరలోనే పూర్తిస్థాయిలో, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది.
కాగా, ఈ రిజిస్ట్రేషన్ చార్జిల భారీ పెంపుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు పేద, మధ్య తరగతి జనాలపై విపరీతమైన భారం మోపనుంది. ఆఖరికి జగన్ రెడ్డి పెళ్లిలపై కూడా పడ్డారని ఆరోపిస్తున్నారు. ఉపాధిలేక జనాలు ఏడుస్తుంటే ఇలా ప్రతీ దాని ఫీజు పెంచడం ఎందుకుని మండిపడుతున్నారు. ఒక వేళ ఫీజులు పెంచినా వందో, రెండు వందలో పెంచాలని కానీ ఇలా వేలకు వేలు పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.