AP New Fashion : ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రెండోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే పార్టీల అధినేతలు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రలు, రోడ్ షోలు, భారీ బహిరంగ సభలతో జనాల్లోకి వెళ్తున్నారు. ఈక్రమంలో మాటల తూటల్లా పేలుతున్నాయి. పంచ్ డైలాగులతో జనాలను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్నారు.
సీఎం జగన్ పై రాయి దాడి, ఆ తర్వాత గాయానికి ఆయన స్టిక్కర్ అతికించుకోవడం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ఇదే ఫ్యాషన్ గా మారిపోయింది. పలువురు జగన్ లా నుదిటిపై స్టిక్కర్ వేసుకుంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా కన్నుకే స్టిక్కర్ వేసుకుంటున్నారు. ఇది ఫ్యాషన్ గా మారడంతో జనాలు మాత్రం ఇదేమి చిత్రం అంటూ ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియా ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
గత ఎన్నికల్లో ‘కోడి కత్తి’ ఇన్సిడెంట్ ను వాడుకున్నట్టుగా ఈ ఎన్నికల్లో గులకరాయి ఇన్సిడెంట్ ను వాడుకుందామనుకున్న జగన్ అండ్ కో ను చూసి ప్రతిపక్షాల నేతలు సెటైర్లు వేస్తుంటే..ప్రజలు తెగనవ్వుకుంటున్నారు. ఈనెల 13న సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్రలో భాగంగా విజయవాడలో ప్రవేశించిన రోజే ఆయనపై రాయితో దాడి చేశారు. బస్సు పై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి చేయగా ఎడమ కనుబొమ్మపై గాయమైంది. ఇక అప్పటి నుంచి ఈ ఘటన సెటైర్లు, ట్రోలింగ్ లకు ముడి సరుకుగా మారింది.
జగన్ కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక కడుపు మంటతోనే ఈ దాడి చేశారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో వైసీపీ వారే ఇలా దాడులు చేయించుకుని సింపతీ క్రియేట్ చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు పెదవి విమర్శిస్తున్నారు. మొన్ననే సీపీఐ నారాయణ కూడా గులకరాయి ఘటనపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బాంబులు వేసుకునే సంస్కృతి నుంచి గులకరాయికి వచ్చారని సెటైర్లు పేల్చారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ పై రాయి వేసిన నిందితుడి సతీశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడే ప్రథమ ముద్దాయిగా పోలీసులు నిర్ధారించారు.