21 Castes out From BC List : ఏపీలో వైఎస్ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాము చెప్పిందే వేదం అన్నట్లు పాలన కొనసాగిస్తున్నది. తమకు అడ్డు వచ్చే వారిపై కేసులు, బెదిరింపులు, వేధింపులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇక ఎన్నికలకు మరో నాలుగు నెలలే గడువు ఉండడంతో మరింత ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. అయితే తాజా జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో వివాదాస్పదంగా మారింది. ప్రాంతాల వారీగా బీసీ జాబితా నుంచి 21 కులాల ను తొలగిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది.
ఇక ఈ జీవో ప్రకారం శెట్టిబలిజలు ఇక రాయలసీమలో బీసీలుగా కాకుండా ఓసీలుగా పరిగణించబడుతారు. అయితే మిగతా ప్రాంతాల్లో మాత్రం వీరు బీసీలుగా ఉంటారు. ఇలా 21 కులాలు కొన్ని ప్రాంతాల్లో బీసీలుగా, మరికొన్ని చోట్ల ఓసీలుగా పరిగణిస్తారు. అయితే ఈ నిర్ణయంతో ఆయా కులాల్లోని యువతకు తీవ్ర నష్టం జరుగుతుందనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఇప్పటికే తెలంగాణలో స్థిర పడిన ఉత్తరాంధ్ర కు చెందిన 23 కులాల వారిని తెలంగాణలో బీసీ కులాల జాబితా నుంచి అక్కడి ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు దీనిని పట్టించుకున్న లీడరే లేకుండా పోయారు.
ఇక ఏపీలో తాజాగా తీసుకున్న నిర్ణయం ఆయా వర్గాల వారిలో ఆందోళనకు కారణమైంది. అయితే దీని వెనుక వైసీపీ ఏదో వ్యూహం రచిస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఆందోళనలు రేగితే, తర్వాత వాటిని రద్దు చేసి మంచి చేసినట్లుగా బిల్డప్ కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నాయి. ఏదేమైనా ఇలా ప్రజలను ఆందోళనకు గురి చేసేలా ప్రభుత్వాల నిర్ణయాలు ఉండడం హేయమని రాజకీయ నిపుణులు అంటున్నారు. వెంటనే ఈ ఉత్వర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.